మృత్యువు

Posted by నవజీవన్

మృత్యు స్పర్శ      (యువతా..తస్మాత్ జాగ్రత్త)

       సమయం మధ్యాహ్నం 2 .30  ప్రాంతం .విశాఖపట్నం సిటి లో బాగా జన సామర్ద్యం ఉన్న స్థలం . అదే స్థలం లో  సిటి లోనే పేరుగాంచిన  పెద్ద బార్ వుంది . ఆ బార్ లో ముగ్గురు కాలేజి యువకులు అప్పటికే పూర్తి గా మందు కొట్టి మరో మందు బాటిల్ ఆర్డర్ ఇచ్చి మత్తు లో జోగుతున్నారు. ఇంతలో ఆ ముగ్గురు  స్నేహితుల మధ్య ఓ విషయం మీద మాటా మాటా వచ్చి ఆ వివాదం గొడవకి దారి తీసింది. నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే స్థాయి కి వెళ్ళింది ఆ గొడవ.  ఒకరినొకరు పరుషపదజాలం తో  దూషించుకోసాగారు. అప్పటి దాకా  స్నేహితులుగా ఉన్న ఆ కుర్రాళ్ళు ఒక్క సారి గా శత్రువులైపోయారు. ఒకరి నొకరు కొట్టుకోవడమే కాకుండా ఆ బార్ లో ఉన్న కుర్చిలపై, బల్లల పై కూడా తమ ప్రతాపాన్ని చూపసాగారు. బార్ ఓనర్ బెంబేలెత్తి పోయాడు. పోలీసులను ఫోను చేసి రప్పించి ఆ కుర్రాళ్ళను  స్టేషన్ కు పంపించాడు. ఇంతలో ఆ కుర్రాళ్ళలో ఒకడు తన దగ్గర ఉన్న మొబైల్ తో ఎవరికో ఫోన్ చేసాడు. ఆ కుర్రాళ్ళు పోలీసు స్టేషన్ లో సైతం తమ గొడవ ను కొనసాగించారు. తమకు ప్రపంచం లో అడ్డనేదే లేదు అన్నట్లు మాట్లాడారు. వాళ్ళను చూసి విస్తుపోవడం ఎస్.ఐ వంతు అయ్యింది. యువత తీరు రోజు రోజుకు ఇలానే మారుతుంది కదా అని ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంతలో తెల్ల బట్టలు వేసుకున్న ఓ నలుగురు వ్యక్తులు స్టేషన్ లో అడుగు పెట్టారు. వాళ్ళను చూడగానే ఆ కుర్రాళ్ళ ముఖాలలో ఆనందం తొంగి చూసింది. "ఈ కుర్రాడు పెద్ద సారు వాళ్ళ అబ్బాయండి.వీళ్ళిద్దరూ అతని స్నేహితులు. ఏదో పార్టీ కని బార్ కు వెళ్లి చిన్న గొడవ లో ఇరుక్కున్నారు. ఇలాంటి వాటిని మీరు పెద్దగ పట్టించుకోకూడదండి.ఈ మాత్రం దానికే స్టేషన్ కు తీసుకొని వచ్చేస్తే ఎలా సార్!!" అని ఆ తెల్ల చొక్కా వ్యక్తి జర్దా కిల్లి నములుతూ ఎస్.ఐ కు ఒక సలాం కొట్టి కుర్చీలో కూర్చుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు..ఆ పెద్ద సార్ ఎవరా అన్నట్లు హెడ్ కానిష్టేబులు ఎస్.ఐ వంక చూసాడు.
          కానిష్టేబుల్ కి అర్ధం కాకపోయినా ఎస్.ఐ కి ఆ వచ్చిన వ్యక్తులు ఎవరి తాలూకో బాగా అర్ధం అయ్యింది. తను కూడా చిరు నవ్వు నవ్వి "పార్టీలు అవి  కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటే ఎలాంటి పరేషాన్ ఉండదు కదయ్యా మాకు..పైగా వీళ్ళు బార్ లో ఫర్నిచర్ కూడా  ధ్వంసం  చేసారు. ఆ బార్ ఓనర్ నష్ట పరిహారం డిమాండ్ చేసాడు.మీరు వెళ్లి అతని తో కాంప్రమైజ్ అయితే మాకు వీళ్ళను విడిచిపెట్టడానికి ఎలాంటి అభ్యంతరము లేదు" అన్నాడు. తెల్ల చొక్కా వ్యక్తి "అలాగే సార్. అతని తో మేము కాంప్రమైజ్ అయినట్లే అనుకోండి.నేను మాట్లాడుతాను. ప్రస్తుతం వీళ్ళను వదిలి పెట్టండి.మళ్ళీ పెద్ద సార్ కి ఈ విషయం తెలిస్తే చాల ప్రాబ్లెం అవుతుంది" అని మరో తెల్ల చొక్కా వ్యక్తి వైపు చూసి ఏదో సైగ చేసాడు.  ఆ తెల్ల చొక్కా వ్యక్తి కి ఏమి చేయాలో అర్ధం అయ్యింది.  ఎస్.ఐ కూడా ఒక్క క్షణం తటపటాయించి హెడ్ కానిష్టేబుల్ ని పిలిచి ఆ కుర్రాళ్ళను వదిలిపెట్టమన్నాడు.
    ఈ కథ లో పెద్ద సారు ఎవరో, తెల్ల చొక్కా వ్యక్తి చేసిన సైగలకు అర్ధం ఏమిటో ఆ పక్క మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ తాగుబోతు కుర్రాడితో పాటు  వచ్చిన ఆ ఇద్దరు కుర్రాళ్ళకు ఏమి అర్ధం కాలేదు. కానీ ఒకటి అర్ధం అయ్యింది. తమను పోలీసులు విడిచిపెడతారు. తాము బయటికి వస్తాము. తమ స్నేహితుడు తమను విడిపించాడు. తామందరం కలిసి వెంటనే మరో బార్ కు వెళ్తాము..ఇవే వాళ్ళు అర్ధం చేసుకున్న సంగతులు .
       ఎలాగైతేనేమి ఆ కుర్రాళ్ళను పోలీసులు విడిచిపెట్టారు. ఇప్పుడు అంతు లేని ఆనందం వాళ్ళ సొంతం. కానీ వాళ్ళ ఆనందం కొద్ది నిముషాలలో వాళ్ళ కుటుంబాలకు అంతులేని విషాదాన్ని కలిగిస్తుందని వాళ్ళు అర్ధం చేసుకోలేదు. మళ్ళీ సిటి అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ఒక అధునాతనమైన బార్ కు వెళ్ళాలి.ఇది వాళ్ళ టార్గెట్. ఒకే బైక్ పై ముగ్గురు ఎమా స్పీడు గా సిటి ని వదిలి చాలా దూరం వేగవంతంగా ప్రయాణించసాగారు.కానీ, వీరికి ఎదురుగా వీరి కంటే పది ఆకులు ఎక్కువ చదివిన ఒక లారి డ్రైవర్  తప్ప తాగి అదే రోడ్డు పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వీళ్ళ బైక్ ను గుద్దేసి అంతే  స్పీడు గా సిటి దాటేసి యమా దర్జా గా వెళ్ళిపోయాడు. అలా ఆ నిర్మాన్యుష్యమైన ఆ రహదారి పై దిక్కు లేని చావు ను ఆ ముగ్గురు  యువకులు కొని తెచ్చుకున్నారు.
   ఈ సంఘటన వింటే సినిమా కథ లా  వుంటుంది. ఇలాంటి స్టూడెంట్ గ్యాంగ్ లను మనం సినిమాలలో చాలా చూస్తుంటాము. కుర్రాళ్ళు ఎంతో చాకచక్యం కలవారు.దేనినైనా  జయించగలరు. పొగరు మా కుర్రాళ్ళ సొంతం..అనుకునే కుర్రాళ్ళను చూస్తుంటే వీళ్ళు వేటినైనా జయించగలరు అని అనిపిస్తుంది. వీరికి ఆదర్శం సినిమాలలో హీరోయిజం చూపించే కథానాయకులు కావచ్చు. లేకపోతే తమ తో పాటు  చదివే  ఈ కథ లో చెప్పిన  పెద్ద సార్ల లాంటి వారి కుమారులు కావచ్చు. యువకుడు ఏ విధంగా నైనా తనను తాను తీర్చిదిద్దుకోవచ్చు. తాను గొప్ప ప్రజ్ఞావంతుడుగా నైనా జీవితంలో రాణించవచ్చు, లేకపోతే వ్యసనపరుడుగా కూడా మారిపోవచ్చు. జీవితం లో తాను ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని విజయాలు సాధించినా  మంచి ని మరచి యువత చెడు మార్గం వైపు అడుగులు వేస్తే  వాటి  పర్యవసానాలను ఎదుర్కోవడం తప్పకుండా జరుగుతుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించే యువకులు ఏదో ఒక నాడు విధి కి బలి అవ్వక తప్పదు (ఈ కథలో మాదిరిగా).






( యువతా ..తస్మాత్ జాగ్రత్త) 
బలమే జన్మం ..బలహీనత మరణం,..బాధ్యతలంతా నీ మీదనే పెట్టుకో..నీ విధికి నీవే విధాతవని తెలుసుకో ..వాస్తవ సత్యాలై న ఈ సూక్తులు నేటి యువతను ఉద్దేశించి స్వామివివేకానంద గళం నుండి జాలు వారినవి. నాడు చికాగో బహిరంగ సభలో ప్రపంచాన్ని ఉత్తేజితం చేసిన వివేకానందుని బోధనలు నేటి యువతకు ఎంతో ఆవశ్యకం కానీ... నేటి సమజంలో కీలకపాత్ర వహించాల్సిన యువత  అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. పాశ్చాత్య నాగరికత విషకౌగిలిలో బందీ అయిన యువత జాతి ఔన్నత్యాన్ని విస్మరిస్తున్నది. నాటి స్వాతంత్య్ర సమరంలో  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వంటి వారి స్ఫూర్తి తో ఉరికొయ్యలకు ఎదురెళ్లి ఉద్యమంలో కీలక భాగస్వామ్యం వహించి బ్రిటీషు సార్వభౌమత్యాన్ని ప్రశ్నించిన ఘనత దేశయువతరానిది. కానీ నేటి యువత తీరే ప్రశ్నర్ధకమైనది. కళాశాలల్లో కార్పోరేట్‌ చదువులు చదువుకున్నా కనీస నైతిక విలువల పాఠాలు నేర్చుకోక , క్షణికావేశాలతో, తాత్కాలిక ఆనందాల కోసం విలువైన విద్యా జీవితాన్ని యువత కోల్పోతుంది. సరస్వతి ప్రతిరూపాలైన విద్యాలయాల్లో  యువతి యువకులు టీజింగ్‌ లు ర్యాగింగ్‌ లకు పాల్పడుతూ తమ భవిష్యత్తు నే కాక ఇతరుల  భవిష్యత్తు ను కూడా అంధకారం చేస్తున్నారు  మాదకద్రవ్యాలకు,నిషేధిక ఉత్ప్రేరక వస్తువులకు బానిసలవుతూ ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నారు. అమ్మాయిల పట్ల  జరుగుతున్న లైంగిక వేధింపులు, ఆత్యాచారాలు, దొంగతనాల్లో , సైబర్ నేరాలలో సైతం యువకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పోలీస్‌  రికార్డులు చెప్పుతున్నాయి.  కుల, మత, రాజకీయ అంశాలలో  అంతరాలు పెరుగుతూ యువతరం మధ్య  విభేదాలు పెచ్చరిల్లి ఘర్షణలకు తావిస్తున్నాయి. యువత లో పెరిగిన మితి మీరిన స్వేచ్చ, వి చ్చలవిడి తనానికి మన రాష్ట్రం లో ఒక స్వప్నిక, ప్రణీతల యాసిడ్‌ దాడి ఉదంతం చాలు. చాలా సందర్బాల్లో పరువుపోతుందనే భయంతో లైంగిక వేధింపులు బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. ఈ నేపధ్యం లో  యువతలో అంతర్గత శక్తిని ఆనాడే మేల్కొలిపి వారికి దశ ,దిశ మార్గదర్శకత్వం చూపిన స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తుల బోధనలను విద్యార్ధులకు ఒక సబ్జెక్ట్ గా కళాశాలల్లో నేర్పించవలసిన అవసరం వుంది.  ఉజ్వలభవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన యువతరం , నేటి అస్తవ్యస్థ పోకడల కు పోతున్న ప్రపంచంలో వివేకానందుని బోధనలు, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్ చరిత్రలను చదవవలసిన అవసరం ఎంతో వుంది .అనునిత్యం చెడు మార్గాలలో పయనించే యువతకు "మృత్యు స్పర్శ" వెన్నంటే వుంటుంది. ఈ ప్రపంచం ఏ  ఒక్కరి చేతిలోనూ లేదు. కనుక యువతా..తస్మాత్ జాగ్రత్త..  

2 comments:

  1. శిశిర said...

    చాలా బాగా రాశారు. మీరన్నట్టు విద్యా విధానంలో నైతిక విలువల బోధన కూడా ఒక అంశం కావాలి.

  2. Meraj Fathima said...

    యువతకు మంచి సందేశం...,
    మీ బ్లాగ్ చాలా బాగుంది. ఇంతవరకూ చూఒడకపోవటం దురదృష్టం.
    నిజమే మంచి ముత్యాలు శోదిస్తేనం దొరుకుతాయి.

Post a Comment