విశాఖ

Posted by నవజీవన్







నగరం నిద్రపోతున్న వేళ


కవిత (ఒక అర్ధరాత్రి ప్రయాణం..విశాఖ రోడ్డు పై)




ఒక అర్థరాత్రి ప్రయాణం..


వైజాగ్  సిటి రోడ్డు పై..


ఒక నిశిత  పరిశీలన.. నయనాల పయనం

ప్రపంచమంతా ఈ ఒక్క నగరం లోనే ఆ సమయాన

మారుతున్న సమాజము

మారిన జనుల తీరు ఆ క్షణాన

11.45 నుంచి 12.15 మధ్య సమయం

పోలీసు పహారాల సమయం

దినసరి వేతగాళ్ళు రోజంతా కష్టించి ఏ రాత్రైనా ఇంటికి చేరాలని

ఆటోలకోసం ఎదురుచూపు జగదాంబ జంక్షన్ లో

నిర్మానుష్యమైన రోడ్డు మార్గాలలో విశాఖ నగరంలో

కాల్ సెంటర్ ఉద్యోగులను చేరవేసే క్వాలిస్ల హోరు ఒక వైపు

రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ్ చప్పరిస్తూ కనిపించే నైట్ డ్యూటీ కార్మికులు  ఒక వైపు

ద్వారకా బస్ స్టేషన్  దగ్గర పక్కలు సర్దుకుంటూ కనిపించే బిచ్చగాళ్ళు మరో వైపు

పూర్ణ మార్కెట్ లో పళ్ళు, కాయలు అమ్ముకునే చిన్న చితక బడుగు జీవులు

ఆశావాదంతో సరుకులు మూటలు కట్టుకుంటూ ఇళ్ళకు వెళ్తున్నారు

వరుణ్ బీచ్ ఇనాక్స్ లో నైట్ షో సినిమా చూసి  అప్పుడే బైక్ పై ఇంటికి వెళ్తున్న యువజంటలు

యునివర్సిటి క్యాంపస్ బయట చెత్త ఊడుస్తూ కనిపించే మున్సిపాలిటి స్వీపర్లు

ఒక వైపు కనిపిస్తుంది తళుకు లీనుతూ జి.వి.ఎం.సి.భవనం

మరో వైపు కనిపిస్తారు గాంధీ పార్కులో విశ్రాంతి తీసుకుంటూ నిరుద్యోగ యువత

కాన్వెంట్ జంక్షన్ దగ్గర కుక్కల హడావిడి

కుటుంబంతో సహా కూలి వాడి జీవితం ఇంకా పూర్తవ్వని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై

చెత్త పేపర్లు ఏరుకుంటూ ఎం.వి.పి రోడ్డు పై  బాల కార్మికులు

కే.జి.హెచ్ బయట ఇంకా బళ్ల పై ఇడ్లి తింటూ ప్రభుత్వ ఉద్యోగులు

గేటు వే హోటల్ బయట కష్టమర్ల తో బేరాలు ఆడుతూ ఆటో డ్రైవర్లు

దసపల్ల ఎక్సిక్యుటివ్ కోర్టు బయట అద్దాల లో ఏదో పానీయం సేవిస్తూ విదేశీయులు

ద్వారకానగర్లో పిచ్చోడి పిచ్చి వాగుడు ఆ నిశిరేయిలో

సిరిపురం బార్ లో ఇంకా తగ్గని తాగుబోతుల సందడి

సంపత్ వినాయకుని గుడి దగ్గర నిదరపోతూ వికలాంగుడు

ఇంకా ఇంటికి చేరక రోడ్డు మీద తిరుగుతున్న కాలేజి కుర్రాడు

మద్దిలపాలెం ఆటో స్టాండు -మూల మూలుగుతూ పడుకున్న ముసలమ్మ


తీతువులు తిరిగే ఆ సమయాన  సెల్ ఫోన్ లో ఏదో సొల్లు వాగుడుతో హైటెక్ లేడి

కనిపించెను దేవతలా అటుగా పోతున్న ఆవారాలకు "సి.ఎం.ఆర్" సెంట్రల్ సాక్షి గా

ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో

జోరుగా దూసుకుపోతున్న ట్రక్కులు, లారీలు ఆ నిర్మానుష్యమైన రోడ్డు పై

ఇసుకతోట వైపు జోరుగా పోతూ అంతర్ రాష్ట్రీయ బస్సు

కొన్ని అర్థం కాని బతుకులు సైతం ఆ రాత్రి కొందరి రూపాన

వీపు వంచి సలాం పెట్టి డబ్బు అడిగిన వయోవృద్దుడు

నూడిల్స్ స్టాల్ దగ్గర ఎంగిలి అడ్డుక్కున్న పసిబాలిక

చైతన్య కాలేజి క్యాంపస్ బయట డిస్కషన్ పెట్టిన  ఆడ- మగ కాని వ్యక్తి

అంత రాత్రి లోను "తలసిలా"దగ్గర మార్కెటింగ్ ఏజెంట్ "ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ" అమ్ముతూ

ఏమిటి ఈ రాత్రి జీవితం అనిపించింది ఆ క్షణాన

మనిషి జీవితం బతకడానికే కదా

ఎన్నెన్నో  జీవితాలు

ఎన్నెన్నో జీవన శైలులు

ఎన్నెన్నో  నడవడులు

ఎన్నెనో జీవిత సత్యాలు

అన్ని కూడా వైజాగు సిటి రోడ్డు పైనే

ఒక్క రాత్రి

అనిపించింది మనిషి జీవన విధానాన్ని చూడటం కూడా

గొప్ప అనుభూతి అని..

మారుతున్న కాలం లో ఎంతో యాంత్రికంగా మారిపోతున్న వైజాగ్ కనిపించింది ఆ రాత్రి

మారిపోతున్న మనుష్యుల జీవన విధానం దార్శనమిచ్చింది ఆ ఒక్క రాత్రి


(ఈ కవిత రాసిన తరువాత నాకు తగు సూచనలు చేసి, కవిత్వం రాయడం లో పలు మెళకువలు తెలిపిన కవిమిత్రులు, పెద్దలు శ్రీ జాన్ హైడ్ కనుమూరి గారికి నా కృతజ్ఞతలు)
 

0 comments:

Post a Comment