రోమియో - జూలియట్

Posted by నవజీవన్

రోమియో & జూలియట్ (షేక్స్ పియర్ రచించిన అద్వితీయ ప్రేమ కావ్యం)
షేక్స్ పియర్ ఎంతో చతురత తో ఈ నాటిక ను రచించాడు. ఎన్నో భావోద్వేగాలతో మనసును హత్తుకున్నట్టు రచించిన ఈ ప్రేమకథ తరువాత ఎందరో రచయితలను ఎన్నో ప్రేమ కథలు రాయడానికి పురిగొల్పింది. ఈ రోజు ఎంతో హృద్యభరితమైన ఆ ప్రేమ కావ్యాన్ని  ఒక చిన్న అనువాద కథ రూపం లో మీ ముందుకు తీసుకురావడానికి సంకల్పించాను.ఒక చిన్న కథ రూపం లో మొత్తం కథను రాయడం జరిగింది.ఇది కేవలం కథా పరిచయం మాత్రమే.


రోమియో & జూలియట్ కథ:


పూర్వం ఇటలీ దేశం లో వెరోనా అని ఒక నగరం ఉండేది.ఆ నగరం లో కాపులేట్స్ మరియు మాంటెక్ అని రెండు సంపన్న కుటుంబాలు ఉండేవి. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం కారణంగా చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఆ కుటుంబాలకు కొత్తేమీ కాదు. ఎప్పుడూ కలహించుకుంటూ రాజ్యంలో భీభత్సాన్ని సృష్టిస్తూ వుంటే, ఒకానొక రోజు వెరోనా పట్టణపు యువరాజు విసుగెత్తి మరో సారి ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు ఏర్పడినా, వారి వలన ఏ విధమైన ప్రాణహాని సంభవించినా వారికి మరణశిక్ష విధిస్తానని శాసనం చేయించి ఆ కుటుంబాలను మందలించి వదిలిపెడతాడు.
   అప్పట్నుంచి ఆ రెండు కుటుంబాలు ఒకరితో ఒకరు చాలా దూరంగా మసులుకుంటూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటారు.
    ఈ కథలో కథానాయకుడు రోమియో మాంటెక్ వంశపు జమిందారి వ్యవస్థకు చెందిన కుర్రాడు. రోసాలిన్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.కానీ రోసాలిన్ కు రోమియో అంటే ఇష్టం ఉండదు. కానీ తనకు సోదరుడి వరసైన బెన్ వోలియో ను, ముసలివాడైన మిత్రుడు మెర్కుషియో ను వెంటపెట్టుకుని ఆమె మనసును గెలుచుకోవడానికి  ఆమె వెంటే పిచ్చివాడిలా తిరుగుతూ వుంటాడు రోమియో. అయినా రోసాలిన్ రోమియోను తిరస్కరిస్తుంది.
   ఒకసారి రోసాలిన్ ఎవరో స్నేహితురాలి విందుకు వెళ్తుందని తెలుసుకొని రోమియో కూడా మారువేషం లో తన స్నేహితులను వెంటబెట్టుకుని అదే విందుకు వెళ్తాడు. అక్కడే మొట్టమొదటిసారిగా జూలియట్ ను చూస్తాడు.
   చూడగానే రోమియో ఆలోచనలు మారిపోతాయి. జూలియట్ అందం అతన్ని వివశున్ని చేస్తుంది. ఆమె సౌందర్యం ముందు అక్కడి దివిటీల కాంతి వెలవెలబోతుంది. ఆమె పేరేమిటని అక్కడున్న వ్యక్తి ని అడుగుతాడు.
   కానీ రోమియో సంధించిన ఆ ప్రశ్న టైబాల్డ్ అనే యువకుడికి వినిపిస్తుంది. టైబాల్డ్ కపులేట్స్ వంశానికి సేనాని వంటివాడు. జూలియట్ కు వరసకు అన్న వంటివాడు. రోమియోను చూడగానే తన శత్రువని వెంటనే గ్రహించేస్తాడు. మాంటెక్ వంశస్తుడు తమ విందు సభ లో  పాల్గొనడం చూసి ఆశ్చర్యపోతాడు. అంతలోనే ఆగ్రహం తో తన శత్రువుగా భావిస్తున్న రోమియో పై కత్తి దూయబోతాడు. కానీ కపులేట్స్ వంశానికి చెందిన ఒక పెద్దమనిషి అతన్ని వారిస్తాడు.
   మరోవైపు రోమియో రోసాలిన్ ను పూర్తి గా మరిచిపోయి, జూలియట్ తో పూర్తిగా ప్రేమలో మునిగి తేలియాడుతుంటాడు.
   కపులేట్స్ వంశం వారు నిర్వహిస్తున్న ఆ విందు సభ లో పెద్ద బ్యాలెట్ జరుగుతుంది. ఆ బ్యాలెట్ ఆఖరి దశ కు చేరేసరికి రోమియో వెళ్లి జూలియట్ కు తన ప్రేమ ప్రతిపాదనను తెలియజేస్తాడు. జూలియట్ కూడా రోమియోను చూడగానే సర్వం మరిచిపోతుంది. మొదట కొంచెం తటపటాయించినా తరువాత రోమియో ప్రేమప్రతిపాదన ను అంగీకరిస్తుంది.
  అదే రాత్రి వాళ్ళిద్దరూ జూలియట్ ఇంటి ఆవరణ లో కలుసుకుంటారు. ప్రేమ కాంతి లో వెలిగిపోతున్న వాళ్ళిద్దరూ ప్రేమికులు మాట్లాడాలనుకుని మాట్లాడలేని మాటలు అన్ని కూడా మాట్లాడేసుకుంటారు. మర్నాడు మళ్లీ కలుసుకోవాలనుకుంటారు.
   కాని రోమియోకు తన స్నేహితుల ద్వారా, జూలియట్ కు పరిచారిక ద్వారా తాము పరస్పరం శత్రువులుగా భావించుకునే కుటుంబాలకు చెందిన వాళ్ళమని తెలుస్తుంది. ఇంతలో జూలియట్ కు కాపులేట్స్ వంశపు పెద్దలు పారిస్ అనే యువకునికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయిస్తారు. జూలియట్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. పారిస్ కు జూలియట్ అంటే ఎడతగని మక్కువ. అనుక్షణం కనిపెడుతూనే వుంటాడు. మరోవైపు రోమియో జూలియట్ మధ్య జరిగిన వ్యవహారాన్ని టైబెల్డ్ తెలుసుకుంటాడు. అతడు రహస్యంగా ఆమెను కాపుకాయడానికి కొందరు వేగులను నియమిస్తాడు.
    ఎలాగైతేనేమి, అదే రోజు  రాత్రి మళ్లీ రోమియో జూలియట్ కలుసుకుంటారు.కన్నీళ్ళతో ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రోదిస్తారు. ఇంతలో రోమియోకు ఒక ఆలోచన స్ఫురణకు వస్తుంది.తామిద్దరం వివాహం చేసుకుంటే ఎలా వుంటుంది. తాము ఒకసారి దంపతులుగా మారితే తమను ఎవరూ విడదీయలేరు కదా! ఈ విషయం లో ఫ్రాయర్ లారెన్స్ అనే ఒక మత బోధకుడు వీరికి సహాయం చేస్తాడు. ఒక సందర్భం లో వీరి ప్రేమకథ ను విని తనే దగ్గరుండి పెళ్లి పెద్ద గా వారి వివాహాన్ని తన ఇంటి లోనే జరిపిస్తాడు. ఆ రోజు ప్రేమికులిద్దరూ ఒకటవుతారు.
   పెళ్లి చేసుకుని రోమియో జూలియట్ గుట్టు చప్పుడు చేయకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. వివాహ విషయం ఒక్క లారెన్స్ కు మాత్రమే తెలుసు. లారెన్స్ హింసకు వ్యతిరేకి. వెరోనా నగరం లో అలజడి సృష్టిస్తున్న ఈ రెండు కుటుంబాలను ఇక్యం చేద్దామనే ఈ వివాహం చేస్తాడు.
  రోమియో తన ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ వీధుల్లో టైబల్డ్ విధ్వంసం సృష్టిస్తూ కనిపిస్తాడు. రోమియోను ఎత్తిపొడుస్తూ, అవమానకరంగా మాట్లాడుతాడు. రోమియో అన్ని మాటలను భరిస్తాడు. ఎంతైనా వాడు తన ఇల్లాలి కి అన్న వరుస కదా అని అనుకుంటాడు. ఆ విధంగా తనను తను సమాధానపరుచుకుంటాడు. కానీ టైబల్డ్ తన స్నేహితుడైన ముసలి మార్కిషియో ని అన్యాయంగా చంపేస్తాడు. తన స్నేహితుడి మరణాన్ని కళ్లారా చూసిన రోమియో టైబల్డ్ ను అడ్డంగా అక్కడికక్కడే నరికి చంపేస్తాడు.
       కానీ నగరం లో వారంతా రోమియో నే తప్పు పడతారు. మహారాజు దగ్గరకు తీసుకొని వెళ్లి మరణశిక్ష విధించాలని ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతారు.రోమియో వికల మనస్కుడవుతాడు. వెరోనా విడిచి పారిపోయి లారెన్స్ యొక్క చర్చి లో తల దాచుకుంటాడు. తన అన్న ను చంపినందుకు జూలియట్ తనను అసహ్యించుకుంటుందేమో అని మధనపడతాడు.
           టైబల్డ్ ని రోమియో చంపిన వార్త దావానలం ల వ్యాపిస్తుంది. జూలియట్ వరకు చేరుతుంది. కపులేట్స్ అందరు రోమియో మీద పగ తో వుంటారు.
               జూలియట్ తన పరిచారిక ను రోమియో జాడ  కనుక్కోమని   పంపిస్తుంది.కానీ రోమియో పిచ్చివాడి ల ఏవేవో నగరాలు తిరుగుతూ ఉంటాడు. తను తన ప్రియురాలను కలవలేడు. కలిసి ఆమెను  మనోవేదనకు గురిచేయలేడు. అలా తిరిగి తిరిగి ఆఖరికి లారెన్స్ ఉండే "మంటువ" అనే ఊరు చేరుతాడు.  ఇక్కడ జూలియట్  ఇంట్లో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. జూలియట్ పరిష్కారం కొరకు లారెన్స్ ను ఆశ్రయిస్తుంది.
            లారెన్స్ ఆమెకు ఒక ఉపాయం చెపుతాడు. ఆమె పై ఒక రసాయనిక ప్రయోగం చేస్తానంటాడు. ఆ రసాయనిక ప్రయోగం వలన ఆమె 48 గంటలు ఊపిరి లేని శవం లా మారిపోతుంది. ఇటాలియన్ సంప్రదాయం ప్రకారం 48  గంటలు శవాన్ని ఖననం చేయరు. 48 గంటల తరువాత రసాయనిక ప్రభావం చేత జూలియట్ మాములు మనిషి అయిపోతుంది. అప్పుడు ఆమెను రహస్యంగా తప్పించి రోమియో వద్దకు చేర్చవచ్చు. ఈ ఉపాయం విజయవంతమయితే రోమియో జూలియట్ లిద్దరూ కలవవచ్చు. జూలియట్ కు  లారెన్స్ ను  నమ్మడం తప్ప వేరే దారి కనిపించదు. ఆమె ఒప్పుకుంటుంది. లారెన్స్ ఆమె పై రసాయనిక ప్రయోగం చేస్తాడు. జూలియట్ శవం వలె నిస్తేజంగా మారిపోతుంది.
       జూలియట్  రసాయనాన్ని సేవించే ముందు ఆమె మనసు పడే స్వగతం ఈ నాటకానికే గొప్ప హైలట్. ఆమె మనసు పరిపరి విధాలుగా దోబూచులాడుతుంది. తను లారెన్స్ ను నమ్మవచ్చా? ఒక వేళ ప్రయోగం వికటిస్తే , తను చనిపోతే తన ప్రియుడి గతేమి కాను? మృత్యువు తనని ఆహ్వానిస్తున్నట్లు, సమాధి తలుపులు తెరుచుకున్నట్లు పలు ఊహాగానాలు ఆమె ని నిలువెల్లా కంపింపజేస్తాయి. ఆమె ఆ రసాయనాన్ని సేవించి నిస్తేజంగా మారిపోతుంది.
      నిస్తేజంగా మారిన జూలియట్ శరీరాన్ని చూసి ఆమె కుటుంబీకులు ఆమె మరణించింది అనుకుంటారు. ఆమె శరీరాన్ని భద్రపరిచేందుకు సమాధి గృహానికి తీసుకువెళతారు. లారెన్స్ ఇక రోమియో చేయవలసిన పని గురించి, తను చేసిన ప్రయోగం గురించి ఒక లేఖ ద్వారా సమాచారం అందిస్తాడు.
   కానీ అదే సమయం లో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో ప్లేగు వ్యాధి ప్రబలడం తో వార్తాహరుల రాకపోకలు ఆగిపోతాయి. లారెన్స్ పంపిన వార్త రోమియోకి చేరదు.
    కాని రోమియో  "మంటువ" నగరం లో కొందరు జూలియట్ మరణవార్త ను గురించి చెప్పుకోవడం వింటాడు. విని వికల మనస్కుడై విరహ వేదనతో గుండెలు పగిలేలా రోదిస్తాడు. వెంటనే వెరోనా నగరం ప్రయాణమవుతాడు. దారిలో ఇక తన ప్రేయసి లేని జీవితం ఎందుకని తన మీద తానే విషప్రయోగం చేసుకుంటాడు. తను చనిపోయేలోగా తన ప్రేయసిని, ఇల్లాలిని, తన సర్వస్వమైన తన జీవిత భాగ్యస్వామి ని ఆఖరి సారి చూడాలనుకుంటాడు.
      ఇంకో మూడు గంటల్లో జూలియట్ కు స్పృహ వస్తుంది అనగా రోమియో గుండెలు పగిలేలా రోదిస్తూ నగర శివార్లలోకి వస్తాడు. కపులేట్స్ వర్గానికి చెందిన వ్యక్తులు  రోమియోను చుట్టుముడతారు. వారందరిని ఎదిరించి శవపేటిక వద్దకు వస్తాడు. అదే సమయం లో జూలియట్ ను వివాహం చేసుకోవాలని తలచిన "పారిస్" అక్కడకు వస్తాడు. లోపలి ఎవ్వరిని రానివ్వవద్దని హుకుం జారి చేస్తాడు. కానీ రోమియో అందరితో తలపడి సమాధి వద్దకు చేరి శవపేటిక లో ఉన్న తన భార్య శవాన్ని తాకబోతాడు. కాని పారిస్ అతన్ని అడ్డుకుంటాడు. పిచ్చి ఆవేశం లో ఉన్న రోమియో పారిస్ ను అక్కడిక్కడే హతమారుస్తాడు.
        తరువాత శవపేటిక లో నిస్తేజంగా పడి ఉన్న జూలియట్ శరీరాన్ని గుండెలకు హత్తుకుని, కౌగలించుకొని విలపిస్తూ ఆఖరి ముద్దు పెట్టి శ్వాస విడుస్తాడు.
         అప్పడే జూలియట్ కళ్ళు తెరుస్తుంది. ఆమెకు పరిస్థితి అర్ధం అవుతుంది. జరిగిన సంగతి అంతా విని లారెన్స్ ఆగ మేఘాల మీద అక్కడకు వస్తాడు. జూలియట్ ను బంధించడానికి సైనికులు ముందుకొస్తారు. జూలియట్ తన భర్త అయినా రోమియో శరీరం పై విలపిస్తూ అతని వద్ద ఉన్న చురకత్తి ని తీసుకొని గుండెల్లో పొడుచుకొని అక్కడికక్కడే మరణిస్తుంది.


         మతబోధకుడు లారెన్స్ సైనికులకు లొంగిపోతాడు. వారు అతన్ని దర్బారుకు తీసుకొని వెళ్తారు. అక్కడ అతను  "రోమియో-జూలియట్" ల ప్రేమకథను మనసుకు హత్తుకొనేలా హృద్యంగా చెపుతాడు.


         తమ కుటుంబాల మధ్య ఉన్న ద్వేషాలు  తమ పిల్లల్ని అంతం చేసాయని కపులేట్స్ మరియు మాంటెక్ కుటుంబాలు గ్రహిస్తాయి.


          కానీ వాళ్ళకు పశ్చాతాపం తప్ప ఏమి మిగలలేదు!


ఈ విధంగా రోమియో జూలియట్ ల ప్రేమకథ విషాద భరితంగా ముగుస్తుంది.


        తరువాత ఇదే కథను ఆధారంగా  చేసుకుని ఎందరో రచయితలు ఎన్నో  కథలు రాసారు. దర్శకులు సినిమాలు సైతం తీసారు. కానీ షేక్స్ పియర్ రాసిన ఈ నాటిక ఎప్పటికి మనం మనస్సులో గుర్తుంచుకోదగ్గ గొప్ప  క్లాసిక్.

0 comments:

Post a Comment