స్పామ్ కథ

Posted by నవజీవన్

ఇదో స్పామ్ కథ ..తస్మాత్ జాగ్రత్త
ఆ రోజు ఓ స్నేహితుడు ఫోన్ చేసి తనకు పూణే లో జాబ్ వచ్చినట్లు ఈమెయిలు ద్వారా కాల్ లెటరు వచ్చిందని, ఇంటర్వ్యు కి తక్షణం రమ్మనారని చెప్పాడు. ఉద్యోగం వచ్చిందంటే అది మంచి విషయమే కదా అని "కంగ్రాట్స్ " అన్నాను. కానీ అసలు విషయం తరువాత చల్లగా చెప్పాడు. ఆ ఉద్యోగం పొందాలంటే 14,500 (అక్షరాల పద్నాలుగు వేల అయిదు వందల రూపాయలు) డిపాజిట్ చేయాలని, ప్రస్తుతానికి అతని వద్ద అంత డబ్బు లేదు కనుక నన్ను సర్దమన్నాడు. నేను అప్పుడు కొంత సేపు సంశయించాను.
                          నిజంగానే ఒక పేరున్న సంస్థ లో ఉపాధి పొందినట్లయితే అంత డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం ఏముంది? పైగా కాల్ లెటర్ అయితే దాన్ని సంస్థ వారు ఈమెయిలు ద్వారా పంపడమేమిటి?
                       నా స్నేహితున్ని వెంటనే వాడికొచ్చిన ఆ కాల్ లెటర్ ని నా ఈమెయిలు ఐ.డి కి ఫార్వార్డ్ చేయమన్నాను. నేను చెప్పినట్లే వాడు ఈమెయిలు చేసాడు. ఆ ఈమెయిలు చూసాక నాకు నిజంగానే తల తిరిగిపోయింది. అది సాక్షాత్తు మారుతీ సుజుకి వారి కంపెని నుంచి వచ్చినట్లు ఉంది. ఇంతకీ సారంశం ఏమిటంటే మారుతీ సుజుకి కంపెని వారు భారత దేశం లో రిక్రూట్మెంట్ చేస్తున్నారని, వారికి ఎంతో మంది అడ్మినిస్ట్రేటివ్  స్టాఫ్ యొక్క అవసరం ఉందని, ఆన్ లైన్ జాబ్ పోర్టల్ లో వచ్చిన రెజ్యుమ్స్ లో కొన్నింటిని ఎంపిక చేసి ఇలా కాల్ లెటర్స్ ద్వారా కబురు చేస్తున్నామని పేర్కొన్నారు.
                    కాకపోతే ముందు 14,500 రూపాయలు డిపాజిట్ చేస్తే ఇంటర్వ్యు అయ్యి ఎంపికైన తక్షణం ఉద్యోగం లోకి తీసుకుంటామని, డిపాజిట్ వాపసు ఇచ్చి నెలకు 64,000 రూపాయల జీతం అన్ని అలవెన్సులతో కలిపి ఇస్తామని సాక్షాత్తు మారుతీ సుజుకి కంపెని సి.ఈ.ఓ సంతకం చేసినట్లు ఒక ఈమెయిలు పంపించారు. చూడగానే అది ఒక పెద్ద బోగస్ ఈమెయిలు అని ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా ఇట్టే కనిపెట్టేయగలడు. కానీ నా స్నేహితుడు ఏమిటి ఇలా ఈ బోగస్ ఈమెయిలు ను నిజం అని నమ్మాడు అని ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను. 
                    వెంటనే నా స్నేహితునికి ఇది బోగస్ ఈమెయిలు అని, దీనిని నమ్మవద్దని ఫోన్ చేసి చెప్పాను. నా స్నేహితుడు మొదట సంశయించినా తరువాత నమ్మాడు. 
                     నిజం చెప్పాలంటే ఈ మధ్య ఇలాంటి స్పామ్ ఈమెయిలు లెటర్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఒక్క కంపెని ఏమిటి ? చాలా కంపెని పేర్ల మీద వస్తున్నాయి. కోకాకోల, హెచ్.ఎస్.బి.సి, హిందూస్తాన్ లీవర్, ఫిలిప్స్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్ ఉన్న సంస్థల పేర్ల మీద క్షణాలలో ఈమెయిలు కాల్ లెటర్స్ నిరుద్యోగులను ఎర వేస్తున్నాయి. ఇవి ఒక రకంగా సైబర్ నేరాలు.కొన్ని బోగస్ సంస్థలు జాబ్ కన్సెల్టెన్సిలుగా  తయారయ్యి నిరుద్యోగులను లక్ష్యం చేసుకొని ఒక దిక్కుమాలిన ఈమెయిలు ను ఎర వేస్తాయి. వారి ఉచ్చు లో చిక్కుకున్నామా ..అంతే సంగతులు. 
                   ఈ బోగస్ సైబర్ నేర ప్రవృత్తి గల సంస్థల గురించి ఇది వరకే వార్త పత్రికల్లో చదవడం వలన కొంత మందికి ఈ విషయాలు కొద్దో గొప్పో తెలుసు. కాని తెలియని వారి సంగతి ఏమిటి? పైగా అప్పుడప్పుడే ఇంటర్నెట్ వాడుతున్న వారికి, ఈమెయిలు ద్వారా చాటింగ్ చేస్తున్న వారికి ఈ బోగస్ ఈమెయిలు లేఖలు అత్యంత ప్రమాదకరం. ఈ ఈమెయిలు కు సమాధానంగా వారికి మరో ఈమెయిలు పంపామా..ఇక వారి బుట్ట లో కొంత వరకు పడినట్టే.మన వివరాలను పంపించమని మనకు మరో ఈమెయిలు వస్తుంది. మన వివరాలు పంపించాక మన ఫోన్ నంబర్ కు ఒక ఫోన్ వస్తుంది. మనం డిపాజిట్ చేయవలసిన డబ్బు ను కంపెని ఎకౌంటు నంబర్ అంటూ ఒక ఎకౌంటు నంబర్ ఇచ్చి అందులోకి ట్రాన్స్ ఫర్ చేయమంటారు. ..ఇక నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందని డబ్బు పంపించారా..ఇక ఇంతే సంగతులు.కొంప కొల్లేరు అయినట్లే ..ఉద్యోగము ఉండదు..డబ్బు కూడా గంగ లో పోసినట్లే ..
             కనుక యువత ఈ ఈమెయిలు లెటర్స్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించవలసిన అవసరం ఉంది.
ఈ మధ్య ఇలాంటి  ఈమెయిలు లేఖలు స్పామ్ గా మన ఇన్ బాక్స్ లోకి ఎడతెరపి లేకుండా వచ్చి పడుతున్నాయి. లాటరీ ల పేరు మీద, ఉద్యోగం పేరు మీద జనాలను మభ్య పెట్టి డబ్బు దొంగలించే ఈ బోగస్ ఈమెయిలు లెటర్స్ కు స్పందించకుండా, మళ్ళీ అటువంటివి రాకుండా ఫిల్టర్ ఆప్షన్ ను ఎల్లప్పుడూ  ఈమెయిలు ఉపయోగించే ముందు ఆన్ లో ఉంచు కుంటే మంచిది.
          ఇటువంటి స్పామ్ రావడానికి కారణం మన ఈమెయిలు ఖాతాలను కొన్ని మార్కెటింగ్ కంపెనీలు తస్కరించడమే..కనుక జనాలు కూడా ఈమెయిలు ఐ.డి ఉంది కదా అని ఏ సైట్ లో పెడితే ఆ సైట్ లో రిజిస్టర్ అయ్యి సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉంటే మంచిది.
            కనుక ఈమెయిలు వినియోగాదారులరా..ఇలాంటి  స్పామ్ కథల పట్ల తస్మాత్ జాగ్రత్త.

0 comments:

Post a Comment