నగేష్ కుకునూర్

Posted by నవజీవన్


విభిన్న చిత్రాల దర్శకుడు -నగేష్ కుకునూర్
ఆ హైదరాబాదీ కుర్రాడు ఎంత పుస్తకాల పురుగో, అంతే సినిమాల పురుగు కూడా. హైదరాబాద్ నారాయణ గూడా దగ్గర లో ఉన్న సినిమా ధియాటర్లలో అతను కాలేజ్ రోజుల్లోనే ఎగ్జామ్స్ కు డుమ్మా కొట్టి మరీ  భాష బేధం లేకుండా ఎన్నో సినిమాలను చూసాడట. అయితే సినిమా ఒక్కప్పుడు అతని ప్రవృత్తి మాత్రమే. కానీ అదే తరువాత తన కెరీర్ అవుతుందని అతను ఊహించలేదు. అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా సినిమాల మీద ఆశ చావక అట్లాంటా లోని వేర్ హవ్స్ థియటర్ లో పార్ట్ టైం యాక్టింగ్ మరియు డైరెక్షన్ నేర్చుకున్న ఈ తెలుగు కుర్రాడు తరువాత బాలివుడ్ లో అందరి దర్శకుల కన్నా విభిన్నమైన చిత్రాలను రూపొందిస్తాడని ఎవరు ఊహించి ఉండరు.

"వన్ కల్చర్ ఎట్ ఏ టైం" అని ఒక లఘు చిత్రం తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నగేష్ కుకునూర్ తన  మొదటి సినిమా "హైదరాబాద్ బ్లూస్  (హైదరాబాద్ కు వచ్చిన ఒక ఎన్నారై కథ)" ని కేవలం 17 లక్షల రూపాయలతో రూపొందించి అది ఇచ్చిన విజయం తో ఉత్సాహంగా ఎడాపెడా ఓ పదిహేను సంవత్సరాలలో ఓ పది చిత్రాలను డైరెక్ట్ చేసి పారేసాడు.సినిమాల మీద పిచ్చి తో అమెరికా లో తను చేస్తున్న "ఎన్విరాన్మెంటల్ కన్సెల్టెంట్ " ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చానని చెప్పే నగేష్ కుకునూర్ తరువాత కాలం లో "హైదరాబాద్ బ్లూస్ 2 (హైదరాబాద్ బ్లూస్ కి సీక్వెల్) , రాక్ ఫార్డ్ (ఒక హాస్టల్ కుర్రాడి కథ), బాలివుడ్ కాలింగ్ (సినిమా అవకాశాల కోసం వెంపర్లాడే యువత మీద తీసిన చిత్రం), ౩ దీవారే (జైలు లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు నేరస్తుల కథ), ఇక్బాల్ (క్రికెట్ కోసం సర్వం ఒడ్డిన ఒక మూగ చెవిటి కుర్రాడి కథ) వంటి అనేక విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు .నగేష్ కుకునూర్ బాలివుడ్ లో చేసిన ప్రయోగాలూ అన్ని ఇన్ని కావు.ఇద్దరు స్త్రీల మధ్య ఉండే మనస్తత్వ విభేదాలను వినూత్నంగా చూపించడానికి చేసిన  ప్రయత్నం  "డోర్" చిత్రం నగేష్ చిత్రాలలోనే విభిన్న చిత్రమైనా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది.
కమర్షియల్ చిత్రాల వైపు కూడా ఒకానొక సందర్భం లో దృష్టి సారించిన నగేష్ అక్షయ్ కుమార్ తో "తస్వీర్" మరియు జాన్ అబ్రహం తో "ఆశాయే" వంటి సినిమాలు తీసినా అవి అంతగా విజయం సాధించలేదు . కానీ అవే చిత్రాలు విమర్శకుల ప్రశంసలను పొందడం విశేషం.

ఏదేమైనా బాలివుడ్ దర్శకులలో నగేష్ కు ఒక విభిన్నమైన స్థానం ఉంది. ఇవి నగేష్ మార్కు చిత్రాలు అన్ని చెప్పుకొనే విధంగా కాస్తా విభిన్నంగా చిత్రాలు తీసే నగేష్ ఈ మధ్య ఎందుకో సినిమాలను చాలా గ్యాప్ తీసుకొని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యే నగేష్ దర్శకత్వం లో వచ్చిన "మోడ్" అనే చిత్రం గురించి కూడా పెద్ద సమాచారం లేదు.

బహుశా, నగేష్ కుకునూర్ ఆలోచనలు మరో కమర్షియల్ చిత్రం చుట్టూ తేలియాడుతున్నాయా ..వేచి చూడాలి.. 

1 comments:

  1. కొత్త పాళీ said...

    నా బ్లాగులో మీ వ్యాఖ్య చాలా బాగుంది. నెనర్లు.
    మీ బ్లాగు పరిచ్యమైనందుకు సంతోషం.

Post a Comment