(డి.డి 8) దూరదర్శన్

Posted by నవజీవన్

(డి.డి 8) దూరదర్శన్ లో  అలనాటి తెలుగు కార్యక్రమాల పై ఒక చిన్న వ్యాసం 


పదిహేనేళ్ల  క్రితం కేబుల్ టీవీ. ప్రసారాలు అంతంతమాత్రంగా  ఉన్న రోజుల్లో అందరూ దూరదర్శన్  ప్రసారం చేసే కార్యక్రమాల పైనే ఎక్కువ శాతం ఆధార పడేవాళ్ళు. అప్పట్లో టి.వి  కొత్తగా కొనడం అనుకుంటా.. మా ఇంట్లో కూడా కేబుల్ కనెక్షన్ రాక ముందు దూరదర్శన్ కార్యక్రమాలే చూసేవాళ్ళం. నేడు చాలా  మందికి తెలియదు గాని, అప్పట్లో దూరదర్శన్  లో నిజంగానే మంచి కార్యక్రమాలు వస్తూ ఉండేవి. తరువాత వచ్చిన శాటిలైట్ చానెల్స్ పుణ్యమా అని, దూరదర్శన్  ను ఎవ్వరూ పట్టించుకోక పోయినా నాకు ఇంకా అప్పుడు దూరదర్శన్ లో ప్రసారమైన మంచి కార్యక్రమాలు ఇంకా గుర్తే. అందులో మచ్చుకు కొన్ని.
టెలి స్కూలు : మామూలు రోజుల్లో ఉదయం 10.15 కు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం లో విద్యార్థులకు సంబంధించిన  అనేక విజ్ఞాన దాయక విషయాలు ప్రసారం చేస్తుండేవారు.
దూరదర్శన్ లో సాహిత్యానికి సంబంధించిన   కార్యక్రమాలు: యెండమూరి వారి వెన్నెల్లో ఆడపిల్ల, కొమ్మనాపల్లి వారి ప్రణయ ప్రబంధం, మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు, భమిడిపాటి రామగోపాలం కథలు సీరియల్స్ గా రావడం గొప్ప అనుభూతి.
దూరదర్శన్ లో తెలుగు లో వచ్చిన చారిత్రాత్మక సీరియల్స్: "ఆనంద ధార" అనే సీరియల్ రుద్రమ్మ దేవి చరిత్ర ను తెలిపే ధారావాహికం. అలనాటి నటుడు ప్రదీప్ తెలుగు లో చేసిన విభిన్న ప్రయోగం "చాణక్య. అలాగే పోతనామాత్యుని మీద వచ్చిన భక్తకవి పోతన, భారవి కవి మీద వచ్చిన "మహాకవి భారవి ", భర్తృహరి జన్మ వృత్తాంతం, ధరణికోట మొదలైనవి చెప్పుకోదగ్గవి." ఆంధ్ర రత్నాలు" శీర్షికన అల్లసాని పెద్దన, మొల్ల, వేములవాడ భీమకవి, ముద్దుపళని మొదలైన వారి మీద రూపొందించిన లఘుచిత్రాలు నిజంగా ప్రత్యేకమే .
దూరదర్శన్ లో వచ్చిన ప్రామాణికమైన టెలిఫిలిమ్స్: విశ్వనాథ సత్యనారాయణ వారి "వేయిపడగలు", త్రిపురనేని గోపీచంద్ కలం నుంచి జాలువారిన "పండిత పరమేశ్వర శాస్త్రి గారి వీలునామా", జంధ్యాల మార్కు "సుబ్బారావు కుక్కపిల్లలు", శుభలేఖ సుధాకర్   "మనిషి" చెప్పుకోదగ్గవి.
ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు: జగమెరిగిన నిర్మాత ఏ.ఎం.రత్నం గారు అప్పట్లో దూరదర్శన్ (తెలుగు) కోసం "క్రైమ్-క్రైమ్" అనే అపరాధక  పరిశోధక సీరియల్ ని నిర్మించి ఇచ్చారు. అలాగే సాంఘిక సీరియల్స్ లో మంజులనాయుడు నిర్మాణం లో వచ్చిన "ఋతు రాగాలు" ఒక ట్రెండ్ సెట్టర్. హాస్య ప్రధానంగా గల సీరియల్స్ లో ఆనందో బ్రహ్మ, మీట్ మిస్టర్ ఆంజనేయులు మొదలైన వాటిని చెప్పుకోవచ్చు. అలాగే హిందీ నుంచి ప్రత్యేకంగా 
శ్రీ కృష్ణ, జై హనుమాన్, జై గంగ మాత, ఓం నమః శివాయ వంటి సీరియల్స్  అనువదింపబడటం విశేషమే.
  ఈ రొజుల్లొ దూరదర్శన్ కార్యక్రమాలలో ప్రమాణాలు తగ్గాయన్న మాట వాస్తవమే. కొత్త నిర్మాతలు ఆసక్తి చూపించకపోవడం, తెలుగు కార్యక్రమాల ప్రసారానికి అనువైన సమయం కుదరకపోవడం మొదలైనవి కారణాలు కావచ్చు. అయినప్పటికీ అలనాటి దూరదర్శన్ యొక్క కార్యక్రమాలు ఇంకా మన హృదయం లో పదిలంగానే  ఉంటాయి.నేడు డి.డి 8 సప్తగిరి గా మారిపోయింది. 


2 comments:

  1. Narsimha said...

    నా బాల్యం అంతా ఈ కార్యక్రమాల తో హాయిగా గడిచింది...నా ఆశ ఏంటంటే ఎప్పటికయినా (మీరు చెప్పిన అన్ని నా లిస్ట్ లో ఉన్నయి నల మహరాజు,హిమబిందు,..)ఆ కార్యక్రమాల వీడియో లు సంపాదించాలని డి.వి.డి లు కొనడానికి కూడా సిద్దమే.మీకేమైనా వివరాలు తెలిస్తే ఈ బ్లాగులో చెప్పగలరని ఆశిస్తూ....

  2. నవజీవన్ said...

    ధన్యవాదాలు నరసింహం గారు ..పాత డి.వి.డి ల గురించి తెలిస్తే తప్పకుండా చెపుతాను. మీ ఆదరణ కు మరో మారు ధన్యవాదాలు.

Post a Comment