అల్పజీవి

Posted by నవజీవన్

రావి శాస్త్రి గారి అల్పజీవి -సామాన్య మనిషి జీవితం లో వివిధ  కోణాలను ఆవిష్కరించిన నవల 
రావి శాస్త్రి గారి అల్పజీవి  నవల  1952 లో  ప్రచురించబడింది. ఈ నవలను రాసే సమయానికి  అతని వయస్సు 30 సంవత్సరాలు మాత్రమే. "చేదు విషం-జీవ ఫలం" పేరుతో ఈ నవల ను "భారతి" పత్రికకు రావిశాస్త్రి గారు పంపించగా దానిని "అల్పజీవి" పేరుతో వారు పత్రిక లో ధారావాహికంగా వేయడం జరిగింది. మనస్తత్వ శాస్త్రాన్ని మానవ సంబంధాలకు ముడి పెడుతూ చేసిన ఒక్క విభిన్న ప్రయోగంగా ఈ నవలను చెప్పుకోవచ్చు. సమాజం లో చిన్న వారిగా బతుకుతున్న బడుగు జీవులకు చిన్న కష్టాలే అప్పుడప్పుడు ప్రతిబంధకాలు అవుతాయని రావిశాస్త్రి గారు ఈ నవలలో పూర్తి గా విశ్లేషించి చెప్పడం జరిగింది.ఈ నవల లోని ప్రధాన పాత్ర పేరు సుబ్బయ్య. ఇది ఒక విచిత్రమైన పాత్ర. అంతే కాదు విభిన్నంగా ప్రవర్తించే పాత్ర కూడా.
 చిన్నప్పుడు సవతి తల్లి చేతి లో కష్టాలు పడి పైకి వచ్చిన సుబ్బయ్య , తన తండ్రి ఒక చిరు ఉద్యోగిగా అధికారుల చేతి లో ఎలా దగా పడి మోసపోతాడో కళ్ళారా చూసిన  వ్యక్తి. అప్పటి నుండి సమాజం అంటే  అతనికి భయం వేస్తుంది. మానసిక దౌర్బల్యుడై సమాజం లో భయస్తుడిగా, నెమ్మదస్తుడిగా, ఇతరుల దృష్టిలో ఏమీ తెలియని లోకజ్ఞానం లేని వాడిగా మిగిలిపోతాడు. బాగా చితికిపోయి, వ్యసనాలకు లోనయ్యి సర్వస్వం కోల్పోయిన ఒక జమిందారు అయిన  వెంకట్ రావు  చెల్లల్ని వివాహం చేసుకొంటాడు.  అయినప్పటికీ భార్య నుంచి కూడా ప్రేమను, గౌరవాన్ని పొందలేకపోతాడు. ఇలా సమాజం లో తనను తక్కువ చేసుకుంటూ ఒక "ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్" తో బాధపడుతూ తనలో తనే మదన పడుతుంటాడు. ఇక ఆఫీసు లో సుబ్బయ్య చేసేది ఒక అతి చిన్న ఉద్యోగం. డిస్పాచ్ క్లర్కు గా అతి తక్కువ జీతం తీసుకుంటూ, అందరి కన్నా తక్కువాడిని అన్న భావాన్ని రోజు రోజుకూ మనసులో పెంచుకుంటూ,  మేనేజర్ దగ్గర నుండి ప్యూన్ వరకూ అందరి చేతా కించపరచ బడి ఒక మానసిక రోగిలా  తయారవుతాడు. ఎవరి కోసమో అప్పు చేసి తను ఇబ్బంది లో పడి ఆ అప్పు తీర్చలేక సుబ్బయ్య పడే వేదన వర్ణనాతీతం. అందరూ సుబ్బయ్య ను ఈసడించుకోవడం మొదలు పెడతారు. ఒక గౌరవం, పరపతి లేని మనిషి గా  సుబ్బయ్య తయారవుతాడు. ఇంతలో ఒక వేశ్య అనబడే టీచర్ వ్యామోహం లో పడతాడు. ఇలా సుబ్బయ్య జీవితం అనేక కోణాలను ఆవిష్కరిస్తుంది.
రావిశాస్త్రి గారు ఈ నవల ను ఒక న్యాయవాది గా సామాన్యుల జీవితాలను బాగా పరికించి చూసి రాసారనిపిస్తుంది. ఈ నవలలో పాత్రల విశ్లేషణ కూడా అదే స్థాయి లో ఉంది. మనో విశ్లేషణల మీద వచ్చిన రెండు నవలలు "అసమర్ధుని జీవయాత్ర -గోపీచంద్" మరియు "చివరకు మిగిలేది- బుచ్చిబాబు" తరవాత బాగా ప్రాచుర్యం పొందిన నవల అల్పజీవి.
ఒక సామాన్య మనిషి జీవితం లో వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ నవల చదవడానికి చాలా ఆసక్తిదాయకంగా ఉంది.
తప్పక సాహితి అభిమానులు అందరూ చదవాల్సిన నవల.


0 comments:

Post a Comment