ఆఖరి వృక్షం

Posted by నవజీవన్

ఆఖరి వృక్షం 

జగత్తు లో మానవత్వం అనే తత్త్వం మంటగలిసి పోయి 
అందరూ రాక్షస హృదయం తో రాటుదేలిపోతే
మోడుబారిన బ్రతుకులకు ఏది జీవించే మార్గం
నోరులేని వృక్షాలకు ఏది తరుణోపాయం
రోజు రోజుకి జవసత్వాలు కోల్పోయి వృక్ష జాతే నశిస్తే
మానవాళి ఏమవును
జనజీవనం స్థంబించునంట
ప్రాణవాయువు కూడా బజారులో బహుకొద్దిగానే దొరుకునంట
ఆ కాలం వచ్చునంట
జనులంతా ప్రేతల పై పడి తమ ఆకలి తీర్చుకొనునంట
రహదారులన్నీ వృక్షహీనమయి పోవునంట
బడి లో పంతుళ్ళు పిల్లలకు ఇవియే వృక్షములని
ఛాయాచిత్రములలో చూపించునంట
ఏ రసాయనమేసినా భూమి సైతం రక్తం చిందించునంట
వ్రణములతో పశు పక్ష్యాదులు రోదించునంట
మానవ సమూహాలు ఆయాసపడుతూ
కాంక్రీటు అడవుల్లోనే కూలిపోవునంట
సూర్యరశ్మి పొగలు గక్కుతూ అగ్ని కిరణాలను వెదజల్లునంట
ఆ కిరణాలతో మనవ దేహం వర్ణరహిత బాధను అనుభవించునంట
వర్షపు నీటిని చూచి ఏళ్ళు గడిచిందని
కర్షక జనులు వాపోవునంట
తిండి సైతం రసాయనాలతోనే తయారవునంట
మనిషి ఆయువు అర్ధ శాతానికే పడిపోవునంట
భూమి తల్లి ఓర్వలేని బాధను చూసి
జనుల కంట పడని
తప్పిపోయిన పసికందులాంటి
"ఆఖరి వృక్షం" ఆవేదనతో
దిక్కులు పిక్కటిల్లేలా హృద్యంగా ఏడ్చునంట

0 comments:

Post a Comment