కారుణ్య మరణాల మీద సలీం కలం నుండి జాలువారిన విభిన్న నవల "మరణ కాంక్ష"

Posted by నవజీవన్

అనగనగనగా ఒక ఊరి లో ఒక కుర్రాడు ఉన్నాడు . అతడి పేరు సిద్దార్థ. సిద్దార్థ కి చిన్నప్పటి నుండి అన్ని విషయాల మీదా కాస్తా ఆసక్తి ఎక్కువే. నాయనమ్మ దేవుడికి పూజ చేస్తుంటే "దేవుడిని ఏమని కోరుకున్నావ్ నాయనమ్మా"అని అడుగుతాడు . "ఈ వయసు లో ఏమని కోరుకుంటాను నాయనా ఆ దేవుణ్ణి ..మహా అయితే అనాయాస మరణం ప్రసాదించమని కోరుకుంటాను" అంటుంది నాయనమ్మ. "అనాయాస మరణం అంటే ఏమిటి నాయనమ్మా" అని ప్రశ్నిస్తాడు సిద్దార్థ. "అనాయాస మరణం అంటే ఏ బాధా లేకుండా హాయిగా ప్రశాంతంగా చనిపోవడం నాయనా" అని బదులిస్తుంది నాయనమ్మ. సిద్దార్థ ఆ రోజు నుండి ఆలోచన లో పడతాడు. "లోకం లో ఎన్ని జీవులు రోగాలు , రొష్టులతో విపరీతమైన వేదనను అనుభవిస్తూ చనిపోతున్నాయి. వీటికి ముక్తి ఎవరు కలిగిస్తారు" అని ఆలోచించడం మొదలు పెడతాడు. 

ఒక రోజు స్కూలుకి వెళ్తుంటే గండు పిల్లి చేతి లో గాయాల పాలై కొన ఊపిరి తో ఉన్న పావురాన్ని చూస్తాడు సిద్దార్థ. ఆ పావురం చాలా వేదన తో, రక్త సిక్తమైన శరీరం తో బాధపడుతూ కనిపిస్తుంది. సిద్దార్థ ఒక్క క్షణం ఆలోచించి ఆ పావురం గొంతు నులిమి చంపేస్తాడు. సిద్దార్థ స్నేహితులందరూ ఈ విపరీత పరిణామాన్ని చూసి విస్తుపోతారు. స్కూల్లో ప్రిన్సిపాల్ కి ఈ విషయం తెలిసి చిన్నతనం లోనే ఇంత రాక్షసత్వమా  అని ఆశ్చర్యపోతూ కఠినంగా  శిక్షిస్తాడు. కాని సిద్దార్థ తాను చేసిన పనిని సమర్దించుకుంటాడు. వేదనతో ఇక "ఈ బతుకు ఎందుకు జీవుడా" అని ఆపసోపాలు పడుతున్న ప్రాణికి అనాయాస మరణం కలిగించడం మంచి పనే  అనుకుంటాడు. అదే సిద్దార్థ పెద్దయ్యాక డాక్టర్ వృత్తి చేపడతాడు. 

 కానీ అతని మనుసులో అనాయాస మరణం మీద ఒక నిర్దిష్టమైన సిద్దాంతం అలాగే ఉంటుంది.
ఇక జీవితం లో బతికి ఉంటామన్నఆశ కోల్పోయి, శారీరకంగా దారుణమైన వేదనను అనుభవిస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్న రోగులు ఎవరైతే ఉంటారో వారిని అందరిని ఒక్క ఇంజక్షన్ తో మరణించేలా చేస్తుంటాడు. ఒక విధంగా వారికి కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తాడు. కాని అనుకోని సందర్భం లో ఇదే విధంగా ఒక పసివాడిని ఇంజక్షన్ తో చంపబోయి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కోర్టు బోను ఎక్కుతాడు సిద్దార్థ. ఎవ్వరు కూడా సిద్దార్థ సిద్దాంతాన్ని సమర్దించరు. సిద్దార్థ కు వ్యతిరేకంగా కోర్టు లో పిటీషన్ ఫైల్ అవుతుంది.

అక్షర అని న్యాయవాది ఈ కేసు లో సిద్ధార్థ కు వ్యతిరేకంగా వాదిస్తుంది. సిద్దార్థ చర్య ను చట్టం అమానుషం అని భావించి అతనికి కఠినమైన శిక్షను విధిస్తుంది. ఇక ఇక్కడ అక్షర కథ విషయానికి వస్తే ఈమె చిన్నప్పటి నుంచి "మస్కులర్ డిస్త్రోఫి" అనే వ్యాధి తో బాధపడుతూ ఉన్న సందర్భం లో ఈ వ్యాధికి చికిత్స అనేదే లేదని, మరణం ఒక్కటే శరణ్యం అని వైద్య లోకం మొత్తం చెప్పినా సరే,తల్లి సహాయం తో, మొక్కవోని దీక్ష తో వ్యాధి ని జయించి ఒక లాయర్ గా లోకానికి పరిచయమై, మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణాల) కు వ్యతిరేకంగా పోరాడుతుంది. 

అటువంటి అక్షర డాక్టర్ సిద్దార్థ చేసిన పనిని అమానుష మైన చర్య గా ప్రతిఘటిస్తుంది. సిద్దార్థ కు శిక్ష పడిన తరువాత అదే కోర్టు లో ప్రసాద్ పేరు మీద "కారుణ్య మరణాన్ని ప్రసాదించమని అనుమతి  కోరుతూ ఒక పిటీషన్ వస్తుంది. ప్రసాద్ అనే విద్యార్ధి కూడా "మస్కులర్ డిస్త్రోఫి" అనే వ్యాది తో బాధ పడుతూ దారుణమైన శారీరక నరకయాతనను అనుభవిస్తూ ఇక ఆ బాధ భరించలేక కారుణ్య మరణాన్ని ప్రసాదించమని కోర్టుని వేడుకొంటాడు. అక్షర అతని అభ్యర్ధన కు వ్యతిరేకంగా కోర్టు లో పోరాడుతుంది. "కారుణ్య మరణం చట్ట విరుద్దమని, ప్రాణాలు తీసుకొనే హక్కు ఎవ్వరికి లేదని, కారుణ్య మరణాలు చట్టబద్దమైతే జరిగే ఘోరాలు వర్ణనాతీతం అని" ఆమె వాదిస్తుంది. ప్రసాద్ అభ్యర్ధన ను కోర్టు తిరస్కరిస్తుంది. ప్రసాద్ కొనఊపిరి తో ఉంటూ వ్యాధి వలన దారుణ మైన నరకయాతన ను అనుభవిస్తాడు. ప్రసాద్ తల్లి వచ్చి అక్షర ను ఒక కోరిక కోరుతుంది. తన కుమారుడు చనిపోయేటప్పుడు అతని సమక్షం లో ఒక్క గంట గడపమని..ఇది ప్రసాద్ ఆఖరి కోరిక అని ప్రాధాయపడుతుంది. 

అక్షర ముందు తటపటాయించినా తరువాత ఒప్పుకుని తన ఎదుటే నరక యాతన అనుభవిస్తూ తుది శ్వాస విడిచిన ప్రసాద్ ను చూసి చలించిపోతుంది. మనిషి చావు ఇంత  ఘోరంగా ఉంటుందా అని ఆలోచన లో పడుతుంది. కారుణ్య మరణాల మీద అక్షర ఒక సంశయం లో చిక్కుకుంటుంది.

ఇది ప్రఖ్యాత రచయిత "సలీం" గారు రచించిన " మరణ కాంక్ష" నవల కు సంగ్రహ కథనం.
సలీం గారు ఇంతకు క్రితం "కాలుతున్న పూలతోట" తో ఎయిడ్స్  మీద ధ్వజం ఎత్తారు. "మరణ కాంక్ష" నవల కారుణ్య మరణాల మీద సలీం పరిశోధించి రాసిన విభిన్న నవల. 

రెండు సంవత్సరాల క్రితం ఇదే అంశం మీద సంజయ్ లీలా బన్సాలి "గుజారీష్" అనే చిత్రం రూపొందించారు.
"మెర్సీ కిల్లింగ్" ను ఆమోదించడం మీద పాశ్చ్యాత దేశాలలో ఎన్నో చర్చలు జరిగాయి. కాని ఎక్కువ శాతం సమర్దనను అవి పొందలేకపోయాయి.

ఈ విభిన్న అంశం మీద తెలుగు లో "సలీం" రాసిన "మరణ కాంక్ష" తప్పక చదవాల్సిన నవలే.


0 comments:

Post a Comment