బాలీవుడ్ లో తెలుగు దర్శకులు

Posted by నవజీవన్

బాలీవుడ్ లో తెలుగు దర్శకులు
బాలీవుడ్ పూర్తి స్థాయి హిందీ చలన చిత్ర పరిశ్రమ. ఎందరో తెలుగు దర్శకులు తమ ప్రతిభా పాటవాలను ఎన్నో హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి నిరూపించుకున్నారు.అలాంటి వారి మీద ప్రత్యేకంగా ఈ వ్యాసం రాయడం జరిగింది. తెలుగు చలన చిత్రాలకు దర్శకత్వం వహించి తక్కువ సమయం లోనే హిందీ చలన చిత్ర పరిశ్రమ లో కూడా తన బాణీ  సినిమాలు అందించిన దర్శకులలో "ఆదుర్తి సుబ్బారావు" గారిని చెప్పుకోవచ్చు. "మూగ మనసులు" సినిమాను హిందీ లో సునీల్ దత్, నూతన్, జమున నటీనటులుగా  గా "మిలన్" గా తీర్చిదిద్దిన ఘనత అతనిదే ."మిలన్" చిత్రానికి బాలీవుడ్ లో "జమున" ఉత్తమ సహాయనటి గా "ఫిలిం ఫేర్" అవార్డు అందుకోవడం విశేషం.  మాన్ కా గీత్, డోలి, దర్పన్, మస్తానా, రక్వాలా, ఇన్ సాఫ్, ధర్మేంద్ర తో "జ్వార్ బాతా" మరియు 1975 లో పండింటి కాపురం ను హిందీ లో రాజేంద్ర కుమార్, మాల సిన్హా, హేమ మాలిని ప్రధాన తారాగణంగా  "సునేరా సంసార్" తీసిన ఘనత కూడా ఆదుర్తి సుబ్బారావు గారిదే. 

ఇక ఇదే స్థాయి లో దర్శకత్వం వహించిన దర్శకులలో "తాపీ చాణక్య" గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్.టి.ఆర్ తో రాముడు భీముడు సినిమాకు దర్శకత్వం వహించిన ఈ దర్శక రత్నం అదే సినిమాను హిందీ లో దిలీప్ కుమార్ తో "రామ్ ఔర్ శ్యామ్" గా  తీర్చిదిద్దడం ఆశ్చర్యకరం.ఇదే దర్శకుడు తరువాత హిందీ లో భికరే మోతీ, మన్మందిర్, జాన్వర్ ఔర్ ఇన్సాన్ మరియు శుభా ఓ శాం అని చిత్రాన్ని కూడా తీయటం జరిగింది. 

ఇక పౌరాణిక చిత్రాల విషయానికి వస్తే కమలాకర కామేశ్వర రావు గారు "శ్రీ రామ్ వనవాస్" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఎన్.టి.రామారావు గారు "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఒకే సారి దర్శకత్వం వహించారు.

ఇక తెలుగు లో సినిమాలు తీస్తూ హిందీ లో కూడా ఒక విభిన్న ఒరవడి సృష్టించిన దర్శకులలో కె .బాపయ్య గారిని చెప్పుకోవచ్చు. జితేంద్ర తో ఎక్కువ చిత్రాలు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు జితేంద్ర తో  దిల్దార్, దిల్ ఔర్ దివార్, టక్కర్,మావాలి, మక్సద్, పాతాల భైరవి, ఆగ్ ఔర్ 'షోలా, మజాల్ వంటి సినిమాలు తీసారు. హిందీ లో ఏకధాటి గా సినిమాలు దర్శకత్వం వహించిన దర్శకులలో కె.బాపయ్య గారిని ప్రముఖుడి గా చెప్పుకోవచ్చు. ఎన్.టి.ఆర్ తో "నా దేశం" తీసిన ఈ దర్శకుడు బాలీవుడ్ లో చాలా చిత్రాలు తీయడం విశేషం. మిథున్ చక్రవర్తి, షమ్మి కపూర్, ధర్మేంద్ర , జాకీ ష్రాఫ్, రిషి కపూర్, సంజీవ్ కుమార్ లాంటి వారితో ఈ దర్శకుడు ఎన్నో చిత్రాలు తీయడం గమనార్హం. 

తరువాత వచ్చిన దర్శకులలో కె.విశ్వనాధ్ తెలుగు లో కళాత్మకమైన సినిమాలు తీస్తూనే అవే చిత్రాలు హిందీ లో రీమేక్ చేస్తుండేవారు. 

ఉదాహరణకు సిరిసిరిమువ్వ ను రిషి కపూర్ తో "సర్గమ్" గాను, శుభోదయం ను రాకేశ్ రోషన్ తో "కామ్ చోర్" గాను, స్వాతి ముత్యం ను అనిల్ కపూర్ తో "ఈశ్వర్" గాను తీర్చిదిద్దారు. శంకర భరణం ను గిరీష్ కర్నాడ్ తో "సుర్ సంగమ్ "గా తీసినా తెలుగు లో ప్రేక్షకాదరణ పొందినట్లుగా ఈ చిత్రం హిందీ లో ప్రేక్షకాదరణ ను పొందలేక పోయింది. కానీ, విశ్వనాథ్ గారు "ఈశ్వర్" చిత్రానికి గాను ఉత్తమ కథా రచయిత పురస్కారాన్ని "ఫిలిం ఫేర్" అవార్డు రూపం లో 1989 లో బాలీవుడ్ లో అందుకోవడం విశేషం.

ఇక జానపద చిత్రాల విషయానికి వస్తే తెలుగు లో "సింహాసనం" చిత్రానికి దర్శకత్వం వహించిన నటుడు కృష్ణ హిందీ లో కూడా జితేంద్ర నటించిన"సింహాసన్" చిత్రానికి దర్శకత్వ బాద్యతలు చెప్పటడం విశేషం. కృష్ణ  "సంపంగి" అని తెలుగు సినిమాను కూడా హిందీ లో డినో మోరియ, బిపాసా బసు జంటగా  "ఇష్క్ హై తుమ్ సే" గా పద్మాలయ ద్వారా రీమేక్ చేస్తున్నపుడు కూడా తనే దర్శకత్వం వహించడం విశేషం. 

ఇదే కోవ లో పయనించిన మరో దర్శకుడు "బాపు".  తేట తెలుగు లో ఆణిముత్యాల వంటి చిత్రాలు అందించిన బాపు హిందీ లో మిథున్ చక్రవర్తి తో "హమ్ పాంచ్", జాకీ ష్రాఫ్ తో "దిల్ జలా" లాంటి యాక్షన్ చిత్రాలు తీయడం విచిత్రమైన విషయం. అదే విధంగా తెలుగు లో తీసిన " సీత కళ్యాణం" ను హిందీ లో  "సీత స్వయంవర్" గా తీసిన ఘనత కూడా "బాపు' దే. 

ఇక బాలీవుడ్ లో కె.రాఘవేంద్ర రావు గారు చేసిన ప్రయోగాలు అన్ని ఇన్ని కావు. "దేవత" చిత్రాన్నిజితేంద్ర తో  "తోఫా" గాను, బొబ్బిలి బ్రహ్మన్న ను దిలీప్ కుమార్ తో "ధర్మ అధికారి" గాను, పెళ్లి సందడి ని సంజీవ్ కపూర్ తో "మేరి సప్నోకి రాణి" గాను, క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రాన్ని "ఆమ్దాని అత్తని ఖర్చా రుపయ్యా" గాను మార్చి తీసిన ఘనత రాఘవేంద్రుడిదే. ఇంకా నిషానా, ఫర్జ్ ఔర్ కానూన్, మాస్టర్జీ, మేరి సాథి, సుహాగన్ వంటి చిత్రాల ద్వారా కూడా ప్రయోగాలూ చేసారు ఈ దర్శక దిగ్గజం. 

ఇక దర్శక రత్న "దాసరి నారాయణ రావు" గారు కూడా బాలివుడ్ లో అడుగుపెట్టి కొన్ని చిత్రాలు తీసారు. జితేంద్ర తో ప్రేమ్ తపస్య,జక్మి షేర్, జ్యోతి బనే జ్వాల, సంతాన్, సర్ఫారోష్, ప్యాస సావన్ తదితర చిత్రాలు తీసారు. తెలుగు లో సూపర్ హిట్ అయిన "ఎం.ఎల్.ఏ ఏడుకొండలు" సినిమాను హిందీ లో అదీ రాజేష్ ఖన్నా తో "ఆజ్ కా ఎం.ఎల్.ఏ"గా తీసిన ఘనత దాసరిదే.

ఇక బాలీవుడ్ మీద ఒక బలమైన ముద్ర వేసిన దర్శకుల్లో తిరుగులేని దర్శకుడు "రాంగోపాల్ వర్మ". శివ తో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ సృజనాత్మక దర్శకుడు బాలీవుడ్ లో చేయని ప్రయోగం లేదు. సర్కార్,రంగీల,కంపనీ,మస్త్,భూత్,నిశబ్ద్ వంటి చిత్రాల మీద తనదైన ముద్ర వేసారు. ఎప్పుడూ వివాదాస్పద దర్శకుడి గా వార్తలలో నిలిచే వర్మ బాలీవుడ్ మీద ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించిన తెలుగు దర్శకుడు.

బాలివుడ్ లో తనదైన శైలి తో వెళ్తున్న  మరో దర్శకుడు మురళి మోహన్ రావు. వెంకటేష్ ను బాలీవుడ్ కు "చంటి" రీమేక్ ద్వారా పరిచయం చేసిన ఈ దర్శకుడు ప్రేమఖైది చిత్రాన్ని రామానాయుడు నిర్మాత గా హిందీ లో దర్శకత్వం వహించడం విశేషం. తెలుగు లో సూపర్ డూపర్ హిట్ అయిన "బావ బావమరిది" చిత్రాన్ని హిందీ లో "సల్మాన్ ఖాన్" కథానాయకుడి గా "బంధన్" అని రీమేక్ చేసిన ఘనత కూడా ఈ దర్శకుడి దే.ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ నటించిన "సుస్వాగతం" చిత్రాన్ని హిందీ లో ఆఫ్తాబ్ శివదాసాని తో "క్యా ఎహి ప్యార్" గా తీసారు.

ఇక అప్పుడప్పుడు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు దర్శకుల విషయానికి వస్తే రవి రాజా పినిసెట్టి చిరంజీవి తో హిందీ లో "ప్రతిభంద్" కు దర్శకతం వహించాక "ఆజ్ కా గుండా రాజ్" కు కూడా తనే ఆ బాధ్యతలు  తీసుకున్నారు.తరువాత సన్నీ డియాల్ తో "అంగ రక్షక్" అని మరో చిత్రాన్ని తీసి ఇక బాలివుడ్ లోకి అడుగు పెట్టలేదు. ఇ.వి.వి సత్యనారాయణ అయితే అమితాబ్ బచ్చన్ తో "సూర్య వంశం" తీసి బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. అదే మార్గం లో "కృష్ణ వంశీ" కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, షారుఖ్ ఖాన్ ప్రధాన తారాగణంగా 
"అంతః పురం" ను 2002 లో "శక్తి" అనే పేరు తో తీసారు. బాలివుడ్ లో కొన్నిచిత్రాలకు చాయాగ్రహ బాద్యతలు వహించి తెలుగు లో దర్శకుడి గా కెరీర్ ప్రారంభించిన తేజ "నువ్వు నేను" చిత్రాన్ని తుషార్ కపూర్ తో "యెహ్ దిల్" గా తీసినా విజయం పొందలేదు. ఈ మధ్య పూరి జగన్నాథ్ కూడా "బుడ్డా హోగా తేరా బాప్" తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.

తెలుగు లోనే కాకుండా దక్షిణ భారత దేశమునే తీసుకుంటే అయితే చాలా మంది దర్శకులు బాలివుడ్ లో మెరిసారు. శంకర్ "నాయక్" ద్వారా, మురుగాదాస్ "గజినీ" ద్వారా, మణిరత్నం "గురు" ద్వారా, బాలచందర్ "ఏక్ దూజే కె లియే" ద్వారా, ప్రియదర్శన్ అయితే "గరం మసాల, బాగం బాగ్" లాంటి చిత్రాల ద్వారా, మలయాళ దర్శకుడు సిద్దిక్ "బాడీగార్డ్" చిత్రం ద్వారా బాలీవుడ్ లో సందడి చేసారు.





0 comments:

Post a Comment