కథానిక - ఆఖరి ప్రశ్న

Posted by నవజీవన్

(ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లొ మార్చి 5 వ తేదిన ప్రసారమైన నా కథానిక )


 సూర్యాస్తమయం కావస్తుంది. దుమ్ము, ధూళి తో పర్యావరణం అంతా కాంతివిహీనంగా ఉంది. దూరాన ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో, ఓ వృక్షం పైనున్న ఓ గూడులో లీలగా వినిపిస్తుంది ఒక అర్థం కాని వేదన. ఆ శబ్దం విని ఒకింత కలవరపడ్డాను. అయినా నిస్సహాయతతో నిట్టూరుస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాను. ఆ నిద్రలో ఎన్నెన్నో కలలు. ఆ కలల వెనుక ఎన్నెన్నో కలవరపరిచే కథలు.

         ఒకప్పుడు నాకు ఈ ప్రాంతంలో ఎందరో స్నేహితులు, సావాసగాళ్ళు ఉండేవారు. వారందరితో కేరింతలు కొడుతూ హాయిగా కాలం గడిపేవాడిని. ఈ ప్రదేశమంతా దివ్యలోకాలను తలపించే బృందావనంలా ఉండేది. నిజమైన నేస్తాలు ఇక్కడే  జత కూడేవి. అయినా ప్రతి ప్రాణికి ఒక జీవితం ఉంటుంది కదా. ఆ జీవిత గమనంలోనే విభిన్న రీతులు ఉంటాయి. నన్ను కన్న తల్లితండ్రులు నాకు కావలసిన విద్యను నేర్పారు. ఆ విద్యతోనే నాకు నేను స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకున్నాను. నా సావాసగాళ్ళతో ఎన్నో ప్రదేశాలు తిరిగాను. మా మైత్రి ఎంతో ముచ్చటగా ఉండేది.

          మాలో ఏ ఒక్కరికి బాధ కలిగినా మిగతావాళ్ళం కలత చెందేవాళ్ళం. మాకు ప్రపంచంలో ప్రతి ప్రాణితో  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక సంబంధం ఉండేది. అయినా నాకు జీవితం మీద ఎన్నో సంశయాలు ఉండేవి. ఏది ఏమైనా ఒకింత మనశ్శాంతితో, ప్రశాంత చిత్తంతో నిష్కల్మషంగా బ్రతుకును గడిపితే చాలు అన్నది నా ఆకాంక్ష.

         అయినా ఒక్కప్పుడు ఈ లోకమే మాకు ఆమడ దూరం లో ఉంటున్నట్లు అనిపించేది. నేను కూడా ఈ సకల ప్రాణి కోటిలో ఒక భాగమే కనుక ఈ ప్రపంచం లో కలిసిపొవడానికే ప్రయత్నించాను.

         "ఓ నేస్తమా! అటు  చూసావా. ఆ సరస్సు లో ఆ జలచరాలు  ఎలా స్వేచ్ఛగా విహరిస్తున్నాయో. ఇటు చూడు... ప్రకృతి కాంతిలో విహంగాలు ఎలా నాట్యమాడుతున్నాయో...ఈ సుందర దృశ్యాలు నా మనస్సుకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో" అని నా నేస్తం అంటే నేనుకూడా జత కలిసి ఈ ప్రకృతిమాత ఒడిలో సేద తీరడానికి ప్రయత్నించేవాణ్ని.

          "నేస్తమా! ఈ ప్రపంచం లో మన స్థానం ఎక్కడ? మన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి" అని ఓ నేస్తం అడిగితే ఓ క్షణం ఆలోచనలో పడేవాణ్ణి.

           ఆనందభరితమైన జీవితం లో అలజళ్ళు ఎదురైనా సర్దుకుపోయేవాణ్ణి. ఎప్పటికీ ఒక్కటే ఆలోచన. నాకు నా తల్లితండ్రులు నేర్పిన విద్యతో తినడానికి నాలుగు గింజలు సంపాదించుకోవడం. ప్రతి రోజు నా లక్ష్యం అదే. నాదే కాదు..నాతో పాటు అహర్నిశలు శ్రమిస్తున్న నాలాంటి బడుగు జీవుల లక్ష్యం కూడా అదే.

                 "మనం నిజంగానే సంతోషంగా ఉన్నామా నేస్తం" అని ఓ నేస్తం అడిగితే ఒక్క క్షణం నవ్వి ఊరుకునేవాణ్ణి. “యాంత్రికమైపోతున్న ప్రపంచంలో నా సంతోషానికి ఏమొచ్చింది ముప్పు"అన్నట్లుండేది నా మౌనమనే సమాధానం.

                     రోజులు గడుస్తున్నాయి. నాకు కుటుంబం ఏర్పడింది. నా తల్లితండ్రులు నేర్పిన విద్యను నా పిల్లలకు నేర్పాలి అన్నదే నా తాపత్రయం. అందుకే ఇదివరకు కంటే  ఒక గంట ఎక్కువ పని చేయడం మొదలుపెట్టాను. జీవితం ఎందుకు మధురమైనదో కుటుంబం ఏర్పడిన తరువాతే ప్రతి ప్రాణికి తెలుస్తుంది. నాతో  పాటు నా సావాసగాళ్ళకు కూడా కుటుంబాలు ఏర్పడ్డాయి. వారు కూడా లోకంలో తీరుతెన్నులు తెలుసుకున్నారు. ప్రకృతిలో మమేకమైపోతూ ఎవరి జీవితంలో ఆనంద క్షణాలు వారు అనుభవిస్తున్నారు.

                   కాని ముసలం అంత వేగంగా వచ్చి పడుతుందని ఎవరూహించగలరు? ఎప్పుడూ ప్రకృతిమాత  ఒడిలో హాయిగా ఆటలాడుకునే నా సావాసగాళ్ళు నిర్లిప్తతతో ఉండసాగారు. ఒక్క క్షణం వాతావరణంలో పెనుమార్పు సంభవించిందేమో అని అనిపించింది.కొందరు భయం తో పరుగెత్తసాగారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను బ్రతికిన ఈ బంగారం లాంటి భూమిలో ఈ ఆక్రోశానికి కారణం ఏమిటి?

                  "పుట్టినబిడ్డలు చచ్చిపోతున్నారు నేస్తం! కారణం ఏమిటో తెలియదు. మన జాతి అంతరించిపోతున్నదేమో అన్న భయంతో ఈ ప్రాంతం వదిలి అందరూ తలో దిక్కు పయనిస్తున్నారు. ఇక నువ్వు కూడా నీ దారి చూసుకో!" ఓ నేస్తం చెప్పిన మాటలు ఇప్పటకీ  నాకు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి.

                   నేను అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదేశం అంతా పరికించి చూస్తూ వెళ్ళసాగాను. అందరూ  తమ తమ నివాసాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అవి అన్ని బోసిపోయి ఉన్నాయి. కొందరు తాము మురిపెంగా కట్టుకున్న ఆవాసాలను సైతం విచారంతో నేలమట్టం చేసి మరీ వెళ్తున్నారు. నేను ఇంకొక అడుగు వేశానో లేదో భయంకరమైన ఆర్తనాదాలు, ఆక్రందనలు, ఆక్రోశాలు ఆ ప్రాంతం నిండా తాండవం చేయసాగాయి. ప్రతీ ఇంటిలో నుండి చావుకేకలు వినిపిస్తున్నాయి. నేను భయంతో నా ఇంటి వైపు వెళ్ళాను. నా కుటుంబానిదీ అదే పరిస్థితి. నా ఇద్దరు పిల్లలు కూడా చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు.

                 అయ్యో! ఇది ప్రకృతి కాదు. ఓ పైశాచిక శక్తి మన మీద పగ పట్టింది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుండి వెళ్లిపోవాలి. ఇలా అనుకున్నంత సేపు పట్టలేదు నా ఇంటి దీపాల ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోవడానికి!

                      ఇక మా జీవితాలకు మిగిలిందేమి లేదు. ఇదివరకున్న సావాసం ఇప్పుడు లేదు. ఇదివరకున్న నేస్తాలు ఇప్పుడు లేరు. వంశం పై పెట్టుకున్న ఆశలూ అడియాసలైనాయి. స్వర్ణ కుటీరం లాంటి మనసు నేలమట్టం అయ్యింది.

                      ఒకప్పుడు  స్వేచ్ఛావాయువులతో ఊపిరి పోసుకున్న మేము వలస జీవులమైనాము. రోదనలతో, వేదనలతో వేరే దిక్కులో జీవితం సాగించడానికి చాలా కాలం పట్టింది. అయినా పరిస్థితి లో ఎలాంటి మార్పు లేదు. మమ్మల్ని ఒక రకమైన నిస్సత్తువ ఆక్రమించింది.

                  
              "ఇది ఒక అగాధం లాంటి సమస్య. ఇక నేను జీవితమనే పరుగుపందెంలో పరుగెత్తలేను. ప్రియతమా! ఎల్లవేళలా తోడుగా నిలిచి నన్ను కాపాడిన నిన్ను విడిచి వెళ్లక తప్పదు" అని హృదయదేవత కూడా నన్ను విడిచి వెళ్ళిన సందర్భంలో ఈ భూమి అంతా ఇప్పుడే భస్మీపటలం అయితే బాగుణ్ణు అనిపించింది.తిండి గింజలతో  జీవితాలను ప్రారంభించి చిరుజీవులుగా చెలామణి అవుతూ ఆనందతీరాలలో రాగాలాపన చేస్తూ యధేఛ్ఛగా  బ్రతుకు వెళ్ళదీస్తున్న నా జాతి అంతరించపోసాగింది. కొందరు పుట్టగానే మరణించసాగారు.

            కొందరు రోగాలతో నరకయాతన పడుతూ నిస్సత్తువతో భూమికి భారమై ఈ లోకంలో బ్రతకలేక విగతజీవులయ్యారు. స్వజాతి జీవులు కనబడటమే కరువయ్యింది. నేను కూడా శక్తినంతా కూడదీసుకుని నా జాతి కోసం దిక్కు దిక్కునా గాలించసాగాను.

           ఆనాటి సావాసగాళ్ళు లేరు. ఆనందతీరాలు లేవు. ఆనాటి మధురమైన జ్ఞాపకాలు కూడా కరువైనాయి. నాకెందుకు దేవుడు చావును ప్రసాదించలేదో అర్థం కాలేదు. ఏదో నిద్ర నటిస్తూ ఒక చెట్టు మూల నక్కి ఈ లోకాన్ని గమనించసాగాను. ఇంతలో ఆవలి చెట్టు దగ్గర నాలాగే కొన ఊపిరితో ఉన్న ఓ ప్రాణి నా వైపు తేరిపార చూసి అడిగింది "నిన్ను ఎప్పుడూ ఈ ప్రాంతం లో చూడలేదే. ఎవరు నీవు"

             "జీవవైవిధ్యం లో ఈ ప్రపంచాన ఎన్నో జాతులు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. అందులో ఒక అభాగ్యున్ని నేను "అని బదులిచ్చాను. “నీ పేరు" అని అడిగింది ఆ జీవి. "పిచ్చుక" అన్నాను."మరి నీ పేరు" అని అడిగాను.

                ఆ జీవి బదులివ్వలేదు. ఓ సారి పరికించి చూసాను. ఆ జీవి ప్రాణాలు అప్పటికే అనంతవాయువుల్లో
కలిసిపోయాయి. ఇంతలో వేణుగానం లాంటి ఓ గానం మధుర స్వరాల రూపంలో ఆ  ప్రాంతంలో  తేలియాడుతున్నట్లు అనిపించింది.

             "కోకిల" గానం విని ఎన్నాళ్ళు అయ్యింది కదా అనుకున్నాను. ఆ సమయంలో  స్ఫురించింది ఇంతకు క్రితం నన్ను ప్రశ్నించిన ఆ జీవి పేరు "కోకిల" అని

             అప్పుడు అనుకున్నాను లోకంలో వినిపించని, మనం వినిపించుకోని  ఆఖరి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని.

4 comments:

  1. శ్రీలలిత said...

    చాలాబాగుందండీ మీ కథానిక. వాస్తవానికి ప్రతిబింబంలా ఉంది.

  2. నవజీవన్ said...

    మీ అభిమానానికి ధన్యవాదాలు శ్రీలలిత గారు ..

  3. mehdi ali said...

    ఒక వాస్తవ దర్పనాన్ని చూసిన అనుభూతి .. చాలా బాగుంది

  4. నవజీవన్ said...

    ధన్యవాదాలు మహిది అలి గారు ..మీ అభిమానానికి కృతఙ్ఞతలు.

Post a Comment