తెలుగు కథలను చలనచిత్రాలుగా తీయడం ఎలా?

Posted by నవజీవన్

తెలుగు కథలను చలనచిత్రాలుగా తీయడం ఎలా?

కథలను చలనచిత్రాలుగా తీయడం అనే అంశం దర్శకుని యొక్క అంతర్ముఖపు తాత్వికతను బట్టి ఉంటుంది. ఎందుకంటే కథలో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు చలనచిత్రం లో ఉండవు. కథలో వస్తువు, శిల్పం, తాత్వికత, వాస్తవికత  యొక్క అవసరం ఎంత ఉంటుందో, వాటిని దర్శకుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కథ చదవకుండా కథను మాత్రమే తెలుసుకొని చిత్రం తీయడం సాధ్యపడదని నా అభిప్రాయం.  కథలో పాత్రల యొక్క స్వభావం అక్షరరూపం లో ఉండి మన మెదడుకు చేరుతుంది. కాని చలనచిత్రం దృశ్యకథనం . ఇది ఒక సంఘటనను ప్రత్యక్షంగా చూపించగలగాలి.కథను యథాతధంగా చలనచిత్రంగా తీయడం లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అందుకే, కేవలం కథలో మూలాన్ని మాత్రమే తీసుకొని కొందరు ఆ కథకు తగ్గ మార్పులు చేసి చిత్రాలు తీస్తున్నారు. 

మూలాన్ని మాత్రమె తీసుకొని చిత్రం తీయడం వలన అసలు కథలో ఉన్న వాస్తవికతకు భంగం కలిగే అవకాశం ఉంది. చలనచిత్రాలు నేడు వాస్తవికతను ప్రతిబింబిస్తున్న అంశాలను చాలా తక్కువగా చిత్రాలలో చూపిస్తున్నాయి.

తెలుగు కథలను చలనచిత్రాలుగా తీసిన వాటిలో కొన్నింటిని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. 

మాలపిల్ల(1938)- దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం (తెలుగు చలనచిత్రం)- మూలం: మాలపిల్ల -కథ: గుడిపాటి వెంకటచలం .రచన సహకారం: ఉన్నవ లక్ష్మీనారాయణ, తాపీ ధర్మారావు.

యజ్ఞం (1991)- దర్శకుడు:గుత్త రామినీడు (తెలుగు చలనచిత్రం)- మూలం:యజ్ఞం -కథ: కాళీపట్నం రామారావు .ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం పొందిన చిత్రం.

స్త్రీ (1995) -దర్శకుడు: సేతుమాధవన్ (తెలుగు చలన  చిత్రం)- మూలం: పడవప్రయాణం -కథ: పాలగుమ్మి పద్మరాజు .ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ తెలుగు చలనచిత్రంగా పురస్కారం లభించింది.

ఒరు చేరు పున్చిరి (2000)- దర్శకుడు:వాసుదేవన్ నాయర్ (మలయాళం)- మూలం: మిధునం -కథ: శ్రీ రమణ (తెలుగు).ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రంగా ప్రత్యేక పురస్కారం వచ్చింది.

గ్రహణం (2004)- దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ (తెలుగు చలనచిత్రం)-మూలం: దోషగుణం- కథ: గుడిపాటి వెంకట చలం .ఈ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ స్తాయి పురస్కారం మోహనకృష్ణకు లభించింది.

మిధునం (2012) దర్శకుడు: తనికెళ్ళ భరణి (తెలుగు చలన చిత్రం) -మూలం: మిధునం - కథ: శ్రీ రమణ 

గుండెల్లో గోదారి (2013) దర్శకుడు: కుమార్ నాగేంద్ర (తెలుగు చలనచిత్రం)- మూలం: గోదావరి కథలు .రచన: బి.వి.ఎస్.రామారావు 










1 comments:

  1. కెక్యూబ్ వర్మ said...

    మూలాన్ని మాత్రమే తీసుకొని పాత్రల చిత్రీకరణలో వాటి స్వరూపాన్ని మార్చేస్తే ఆ కథకు ద్రోహం చేసిన వారవుతారు, ఇటీవల కొన్ని చిత్రాలలో అలా జరుగుతోంది. దృశ్యంగా మార్చే క్రమంలో అదనపు అంశాలను చేర్చడం వలన కథ బరువు తగ్గుతుంది. దీనిని దర్శకులు గమనిస్తే కథకు న్యాయం జరుగుతుందనుకుంటా. మీ బ్లాగు బాగుంది.

Post a Comment