పాకుడురాళ్ళు

Posted by నవజీవన్






సినిమా వ్యవస్థలోని కథానాయికల వాస్తవ జీవన చిత్రణ రావూరి భరద్వాజ "పాకుడురాళ్ళు"

సినిమా జగత్తులోని చీకటి తెరలను బహిర్గతం చేసి తన శైలిలో రావూరి భరద్వాజ గారు రాసిన నవల "పాకుడు రాళ్ళు". ఈర్ష్య, అసూయ, ఆర్భాటం, డాబు, దర్పం, అధర్మం, అనైతిక విలువలతో కూడిన సినీ వ్యవస్థలో ఒకానొక వర్గం పై ఎక్కుపెట్టిన బాణంగా ఈ నవలను చెప్పుకోవచ్చు.

నాటకాలలో స్త్రీ కళాకారుల జీవితం తో నవలను మొదలు పెట్టిన రచయిత తరువాత పడుపు వృత్తి లోని కష్టాలను చెపుతూ, సినిమా వ్యవస్థ లో దళారుల ప్రవేశం గురించి, నిర్మాతల కష్టాల గురించి కథలో ప్రస్తావిస్తూనే "మంజరి" అనే ఒక పాత్రను సృష్టించి సినిమా ప్రపంచంలో ఎదగడానికి ఆమె ఎలాంటి దిగ్గజాలతో సన్నిహితంగా ఉంటూ తను అనుకున్న లక్ష్యాన్ని చేరిందో వివరిస్తారు.

అంగబలం, అర్థబలం లేని ఒక స్త్రీ సినిమా లోకాన్ని తన వశం చేసుకొని కొన్ని రోజులు ఆ ప్రపంచాన్నే ఏలిందంటే సామాన్యమైన విషయం కాదు. ఈ నవలలో కొన్ని విషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని చదువుతున్నప్పుడు అనిపించినా, తరువాత మధ్యలో అవి వాస్తవాలే కావొచ్చన్న భావన చదివేవారికి కలుగుతుంది.

"పాకుడురాళ్ళు" నవల వాస్తవిక దృక్పథంతో రాసిన నవల అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్ని చిన్ని లోపాలు ఉన్నాయి. చదివేవారికి కొన్ని పాత్రల మీద సానుభూతి, అభిమానం కలిగే సమయానికి అవి మటుమాయమై పోతూ ఉంటాయి.

మొదట పడుపు వృత్తి చేసుకుంటూ జీవించిన మంజరి తరువాత నాటక రంగం వైపు వచ్చి ఒక పేరొందిన నటీమణిగా కొన్ని రోజులు వెలుగొంది తరువాత "చలపతి" అనే ఒక దళారి ప్రోద్బలం తో మద్రాసు చలన చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన తరువాత చిత్ర పరిశ్రమ లో దిగ్గజాలు అనదగ్గ "రావు గారు" "మూర్తి" అనే ప్రముఖ కథానాయకులతో సన్నిహితంగా ఉంటూ, వెంకటేశ్వర్లు, ప్రసాద్ అని పేరు గల నిర్మాతలను నామరూపాలు లేకుండా చేసి, శర్మ అని సినిమా పత్రిక విలేఖరి ద్వారా తను అనుకున్న పనులు సాధించుకుంటుంది.

 కళ్యాణి అని ప్రముఖ సినీనటి సహాయం తో రాజన్ అనే తమిళ వ్యాపారవేత్తను లొంగదీసుకొని, మెహతా అనే ఉత్తరాది కి చెందిన ఒక సినిమా ఫైనాన్షియార్ తో సంబంధం పెట్టుకుని చిత్ర సీమలో తిరుగులేని నటిగా ఎదిగి ఒకానొక సమయంలో పరిశ్రమలోని పేరొందిన నటులకే కంటగింపుగా తయారవుతుంది. కళ్యాణి, మంజరి ప్రాణ స్నేహితులవుతారు. అనుకోని సందర్భం లో కళ్యాణి దారుణ హత్యకు గురి అవుతుంది. కళ్యాణి హత్య మంజరిని క్రుంగదీస్తుంది.

చిత్రసీమ లో మంజరికి వ్యతిరేకంగా ఒక వర్గం తయారవుతుంది.వారు మంజరి మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తారు. కాని ఆమె వ్యూహాల ముందు వారి ఆటలు ఏమి సాగవు. ప్రముఖ నటులు కూడా ఆమెను దూరం పెడతారు. మంజరి తనతో నటించడానికి "చంద్రం" అనే ఒక పెద్ద ప్రాముఖ్యత లేని కథానాయకునికి అవకాశం ఇస్తుంది.ఆమె అహంకారం, దర్పంతో తనకు తోచిన నిర్ణయాలు తీసుకుంటుంది. గుర్రపందాలలో కొంత ధనాన్ని కోల్పోతుంది.

బొంబాయి వెళ్లి లాలరాం అనే ఒక దళారి సహాయంతో హిందీ చలచిత్ర పరిశ్రమ లో కూడా కాలుపెట్టి అక్కడ కూడా తన స్థాయి లో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తుంది. కిషన్ అనే వ్యాపారవేత్త ప్రోద్బలం తో ఒక చిత్రం లో కూడా నటిస్తుంది. శంకర్ పిళ్ళై అనే ఒక బ్రోకర్ సహాయం తో పైరవీలు చేస్తుంది.

తరువాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా పాల్గొని హాలివుడ్ ను సందర్శించి మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ వంటి ప్రముఖ నటీమణులను కలుసుకొని వారితో ముచ్చటిస్తుంది. జీవితం లో తనకు తిరుగేలేదని ఒకానొక సందర్భం లో విర్రవీగిన ఈ కథానాయిక ఒక వికృత చక్రం లో ఇర్రుక్కుపోత్తున్నానన్న సంగతి ని ఆలస్యంగా తెలుసుకుంటుంది. బొంబాయిలో ప్రముఖ కథానాయిక అయిన సితారని అధిగమించాలని ఒక ధ్యేయాన్ని నిర్దేశించుకుంటుంది.

ఆ ప్రయత్నం లో తన చుట్టూ చేరుతున్న ప్రమాదకరమైన వ్యక్తులను కనిపెట్టలేకపోతుంది. సక్సేనా అనే ఒక కార్పోరేట్ దళారి వలలో చిక్కుకొని, అతని మోసానికి బలయ్యి ఒక నీలి చిత్రంలో నటించే దుస్థితికి దిగజారి గత్యంతరం లేని సమయం లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలిస్తుంది. ఈ విధంగా మంజరి కథ అర్ధాంతరంగా ముగుస్తుంది.

ఈ నవల సినీ వినీలాకాసం లో కొందరు పెట్టుబడిదారుల వినూత్న కేళిలో బలైపోతున్న కథానాయికల గురించి ఒక వైపు చెపుతూనే, స్వార్ధం తో తమకు తామే ఈ ఛత్రం లో ఇరుక్కుని బలైపోతున్న సినిమా నిర్మాతలను గురించి కూడా చెప్పడం జరిగింది. రచయిత సినిరంగం లోని కుట్రలను, కుతంత్రాలను యదార్ధంగా బయటపెడుతూ ఈ ప్రత్యేక వ్యవస్థలో వర్గాల మధ్య కార్చిచ్చును రగిలించే పోటీతత్వం మానవీయ కోణాన్ని ఎలా దిగాజార్చడానికి ప్రయత్నిస్తుందో చెపుతారు.

"మంజరి" పాత్ర ద్వారా రచయిత విభిన్న కోణాలను ఆవిష్కరిస్తారు. ఏమి తెలియని పాత్ర అని ఈ పాత్రను కొట్టివేయలేము. అహంకారం, అతితెలివి, అసహనం అన్ని కలబోసిన పాత్ర ఇది. ఈ నవల సినిమారంగం లో పెద్దవాళ్ళం అని చెప్పుకొనే కొందరు ఆ ప్రపంచం లో పైకొస్తున్న నటులను ఎలా తోక్కివేయడానికి ప్రయత్నిస్తారో చెపుతూనే, ఆ ప్రయత్నం లో జరిగే ప్రమాదకర సంఘటనలు ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తాయో కూడా చెపుతుంది.

ఈ నవల లోని అంశాలు మారుతున్న కాలంలో ఒక విషసంస్కృతికి అడ్డం పడుతున్న సంప్రదాయానితో జాగారూపులై ఉండమని హితవు చెపుతాయి.చిత్ర జగత్తులో కృత్రిమ బంధాల కోసం అనునిత్యం ప్రాకులాడుతూ ఇదే స్వర్గం అని వెర్రితలలు వీస్తూ సినీలోకానికి దాసోహం అవుతున్న కొందరు అభాగ్యుల జీవితాలను కేంద్రబిందువుగా చేసుకొని ఒక పతనానికి కారణమవుతున్న కులీన సంస్కృతి పై గొడ్డలిపెట్టు "పాకుడురాళ్ళు"


5 comments:

  1. Karthik said...

    ముందుగా మాకు ఇలాంటి మంచి పుస్తకం పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.... మీ రచనా శైలీ నన్ను బాగా అకట్టుకుంది... మీరిలాగే ఎప్పుడూ రాస్తుండాలని నా ఎగిసే అలల మది కోరిక.. తప్పక తీరుస్తారు కదూ..

  2. నవజీవన్ said...

    మీ అభిమానానికి ధన్యవాదాలండి

  3. Meraj Fathima said...

    మీరు ఎన్నుకున్న పుస్తకం చూస్తేనే మీ వ్యక్తిత్వం అవగతం అవుతుంది,
    కార్తిక్ గారన్నట్లు మంచి శైలి.
    బ్లాగ్ లోకాన ఓ మంచి దారి. అభినందనలు.

  4. నవజీవన్ said...

    సోదరి ఫాతిమాగారికి నా ధన్యవాదాలు..

  5. తెలుగోడు_చైతన్య said...

    చాలా బాగుంది...మాష్టారు!
    http://sskchaithanya.blogspot.com

Post a Comment